ముంబై : భారత పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించినట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ముంబై మాజీ దిగ్గజమైన 53 ఏండ్ల బహుతులేకు దేశవాళీ క్రికెట్లో అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్లో భారత్ తరఫున రెండు టెస్టులు, 8 వన్డేలు ఆడిన సాయిరాజ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఏకంగా 630 వికెట్లు పడగొట్టడంతో పాటు 6,176 పరుగులు చేశాడు.
రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా ప్రస్థానం ప్రారంభించి విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ జట్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలకు స్పిన్ కోచ్‌గా సేవలు అందించిన బహుతులే, 2021-2024 మధ్య కాలంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనూ పని చేశాడు. అంతేకాకుండా, 2022లో ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత యువ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించి ఆటగాళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఈనెల 6 నుంచి ముల్లన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ స్పిన్ కోచ్‌గా బహుతులేకు తొలి అసైన్మెంట్ కానుంది.