Saina Nehwal : పెళ్లితో ముడిపడిన అనుబంధాన్ని తెంచుకోవడం అంత సులభం కాదంటారు పెద్దలు. అయితే.. ఎన్నో ఏళ్లు భార్యాభర్తలుగా ఉండి.. విడాకులతో దూరమవుతున్న జంటలు చాలానే. ఈమధ్యే తాము విడిపోతున్నామని చెప్పిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) మాత్రం యూటర్న్ తీసుకుంది. భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) నుంచి బ్రేకప్ విషయాన్ని పునరాలోచిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది సైనా. దూరం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిందామె.
జూలై 13న భర్త నుంచి విడిపోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సైనా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. నెల లోపే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. భర్తతో కలిసి ఉండేందుకు సిద్దమవుతున్నట్టు సైనా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. ‘కొన్నిసార్లు దూరం వర్తమానం గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే మేము విడాకుల వార్తలపై పునరాలోచిస్తున్నాం’ అని శనివారం సైనా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసిన చాలామంది.. వీరిద్దరూ మనసు మార్చుకున్నారని, దంపతులుగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నారని అనుకుంటున్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్లుగా పలు టైటిళ్లు కొల్లగొట్టిన సైనా, కశ్యప్‌లు పదేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ 2018లో పెళ్లి చేసుకున్నారిద్దరూ.