కొలంబో: దాయాదుల పోరులో యువభారత్ జయకేతనం ఎగురవేసింది. ఎమర్జింగ్ ఆసియాకప్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 206 పరుగుల నిర్దేశిత లక్ష్యాన్ని యువ భారత్ 36.4 ఓవర్లలో 210/2 స్కోరు చేసింది. యువ ఓపెనర్ సాయి సుదర్శన్(110 బంతుల్లో 104 నాటౌట్, 10ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.
పాక్ బౌలర్లను సమర్థంగా నిలువరిస్తూ ఆది నుంచే దూకుడైన ఆటతీరు కనబరిచాడు. మరో ఓపెనర్ అభిషేక్‌శర్మ(20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా..నికిన్ జోస్(53)తో కలిసి జట్టు విజయంలో కీలకమయ్యాడు.తన ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్స్‌లతో చెలరేగిన సాయి..పది బౌండరీలు ఖాతాలో వేసుకున్నాడు. ముబాషిర్ఖాన్, మెహ్రాన్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత రాజ్వర్ధన్(5/42)ధాటికి పాక్ 48 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. ఖాసిమ్ అక్రమ్(48), ఫర్హాన్(35) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సెంచరీతో రాణించిన సాయికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.