ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో టెన్నిస్ కోసం ప్రకటించిన ఏడుగురి బృందంలో తెలంగాణ అమ్మాయి, భారత నంబర్ వన్ ర్యాంకర్ యమలపల్లి సహజ సహా ఐదుగురు ప్లేయర్లను తప్పించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పందించింది. మెగా గేమ్స్ కోసం తమకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారమే ఎంపిక చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘మాకు ఐవోఏ నుంచి వచ్చిన ఫైనల్ షార్ట్‌లిస్ట్ మేరకే ప్లేయర్లను ఎంపికచేశాం.
అసలు ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) ఇచ్చిన జాబితాలోనూ వారి పేర్లు లేవు’ అని పేర్కొంది. అయితే దీనిపై ఐటా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘మేం జాబితాలో ఆటగాళ్ల పేర్లివ్వలేదనడం సరికాదు’ అని చెప్పడం గమనార్హం. క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. గడిచిన 12 నెలల కాల వ్యవధిలో సింగిల్స్ విభాగంలో (ఆసియాలో) టాప్-6, డబుల్స్ కేటగిరీలో టాప్-8 ర్యాంకులో ఉన్నవారిని మాత్రమే తీసుకుంటారు. సహజతో పాటు మానస్ ధామ్నె (మెన్స్ సింగిల్స్), వైష్ణవి (విమెన్స్ సింగిల్స్), వైదేహి చౌదరి (విమెన్స్ డబుల్స్), ప్రార్థనా (విమెన్స్ డబుల్స్) పేర్లను ఆసియాడ్‌లో చేర్చకపోవడాన్ని టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తప్పుబట్టాడు.