ఖమ్మం సిటీ: మహారాష్ట్రకు చెందిన సాగర్ కతుర్థే ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. భారత బాడీబిల్డర్స్ ఫెడరేషన్(ఐబీబీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ శనివారం ముగిసింది. ఇందులో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 532 మంది బాడీ బిల్డర్లు పోటీపడ్డారు. ఎత్తు, బరువు, వ్యక్తిగత విభాగాలు కలిపి మొత్తం 10 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 80 కిలోల విభాగంలో సాగర్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, తమిళనాడు వాసులు కార్తికేశ్వర్, శరవణన్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. టీమ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు 225 పాయింట్లతో మొదటి స్థానం కైవసం చేసుకుంది. తమిళనాడు(130), సర్వీసెస్ కంట్రోల్ బోర్డు(120) రన్నరప్ టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. మోస్ట్ ఇంప్రూవుడ్ బిల్డర్‌గా నితిన్, బెస్ట్ పోజర్గా కృష్ణారావు ప్రత్యేక పతకాలు సాధించారు. వివిధ బరువు విభాగాల్లో 50 మంది బిల్డర్లను విజేతలుగా ప్రకటించారు. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐబీబీఎఫ్ ప్రధాన కార్యదర్శి చైతన్య, ప్రేమ్‌చంద్, ఫౌలీ, భాస్కరన్, స్వామి రమేశ్, చంద్రశేఖర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.