Kapil Dev – Anshuman Gaikwad | భారత్ క్రికెట్ లెజండరీ ఆల్ రౌండర్ – హర్యానా హరికేన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీం ఇండియా క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండటం చాలా విచారకరం, నిరుత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు. అన్షుమన్ గైక్వాడ్‌ను ఆదుకునేందుకు బీసీసీఐ ఆర్థిక సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం బరోడాలో చికిత్స పొందుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న గైక్వాడ్‌ను ఆదుకునేందుకు కపిల్ దేవ్ తోపాటు సునిల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్ సర్కార్, మొహిందర్ అమర్ నాథ్, సందీప్ పాటిల్, మదన్ లాల్, కీర్తి ఆజాద్ వంటి మాజీ క్రికెటర్లంతా నడుం బిగించారు. తమ బంధు మిత్రులను, కార్పొరేట్ సంస్థలను సంప్రదిస్తున్నారు.
ఈ సందర్భంగా కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘అన్షుమన్ గైక్వాడ్ ప్రస్తుత పరిస్థితి చాలా విచారకరంగా, నిరుత్సాహకరంగా ఉంది. ఆయన పట్ల కేర్ తీసుకునేందుకు బీసీసీఐ ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అన్షుమన్ తో కలిసి నేనూ ఆడాను. ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తే మనస్సు చలించి పోతోంది’ అని అన్నారు. 1975-87 మధ్య అన్షుమన్ గైక్వాడ్.. భారత్ మధ్య 40 టెస్ట్ మ్యాచ్ లు, 15 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడాడు. భారత్ టీం కోచ్ గానూ పని చేశారు.
‘మేం ఎవరినీ బలవంతం చేయడం లేదు. అన్షుమన్ కు సాయం చేయాలని భావించే వారు తమ హృదయ స్పందనకు అనుగుణంగా ముందుకు రావాలి. ఇంతకుముందు కూడా ఆయన ఫాస్ట్ బౌలర్లకు మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలవాల్సిన తరుణం. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆయనకు మద్దతు పలకాలి. ఆయన రికవరీ సాధించాలని ప్రార్థించాలి’ అని కపిల్ దేవ్ చెప్పాడు.
1983లో కపిల్ దేవ్ సారధ్యంలో టీం ఇండియా తొలిసారి వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్నది. ‘ఆ తర్వాతే బీసీసీఐకి మనీ వస్తోందని భావిస్తున్నారు. కనుక మాజీ క్రికెటర్ల పట్ల వారు కేర్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మనకు అటువంటి వ్యవస్థ లేదు. ప్రస్తుత తరం ఆటగాళ్లు బాగా మనీ సంపాదిస్తున్నారు. సపోర్ట్ స్టాఫ్‌కు కూడా బాగానే చెల్లించడం మంచి పరిణామం. మా టైంలో బీసీసీఐ వద్ద మనీ లేదు. ఇప్పుడు పాత తరం క్రికెటర్లను ఆదుకునేందుకు వారు ముందుకు రావాలి’ అని అన్నారు కపిల్ దేవ్.