క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. అభిమానులంతా ప్రేమగా ‘క్రికెట్ దేవుడు’గా పిలుచుకునే ఈ మాజీ స్టార్ బ్యాటర్ కెరీర్లో ఆగస్టు 14కు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున సచిన్ తన తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. 1990 ఆగస్టు 14న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సచిన్ తొలి సెంచరీ చేశాడు.
అప్పటికి సచిన్ వయసు 17 సంవత్సరాల 112 రోజులు. దీంతో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుతు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 519 పరుగులు చేసింది. భారత్ కూడా ధాటిగా ఆడి 432 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో 320/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. భారత్ ముందు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇలాంటి సమయంలో భారత్‌కు అండగా నిలిచిన సచిన్ 119 నాటౌట్ (189 బంతుల్లో) అద్భుతమైన శతకంతో జట్టు ఓడిపోకుండా అడ్డుకున్నాడు.
అతని పోరాటంతో భారత జట్టు ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇది సచిన్ కెరీర్లో 9వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. అంతకుముందు ఆడిన 8 టెస్టుల్లో సెంచరీ చెయ్యలేకపోయిన సచిన్.. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శతకం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం సచిన్‌కు రాలేదు.
తన కెరీర్లో 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన సచిన్.. 100 అంతర్జాతీయ శతకాలతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ కూడా సచినే. నేటితరం క్రికెటర్లు ఎవరూ సచిన్‌కు దరిదాపుల్లో కూడా లేరంటే అతిశయోక్తి కాదు.
🗓️ #OnThisDay in 1⃣9⃣9⃣0⃣
The legendary @sachin_rt scored his maiden international 💯 against England at the age of 17 and the rest is history 👌👌#TeamIndia pic.twitter.com/9QiynN8bcL
— BCCI (@BCCI) August 14, 2022