Sachin Tendulkar : గత కొన్ని రోజులుగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రహస్యంగా నిశ్చితార్ధం ఫొటోలు మీడియాలో వైరలవుతున్నాయి. అయితే.. ఈ వ్యవహారంపై సచిన్ నేరుగా ప్రకటన చేయకపోవడంతో ఇదంతా నిజమా?.. కేవలం వందతులేనా? అని సందేహాలు వెలిబుచ్చారు పలువురు నెటిజన్లు. తమ వారసుడి పెళ్లి ఫిక్స్ అయిందని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు సచిన్ మౌనం వీడాడు. ఒక యూజర్ ప్రశ్నకు బదులిస్తూ ‘అవును.. మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింద’ని స్పష్టం చేశాడు.
లెజెండరీ క్రికెటర్ వారసుడైన అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం ఫొటోలు బయటకు వచ్చాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చంధోక్ (Saaniya Chandhok)తో ఎంగేజ్మెంట్ అయినట్టు అతడి సోదరి సారా కూడా పోస్ట్‌లు పెట్టింది. దాంతో.. సచిన్ కూడా పోస్ట్ ద్వారా అభిమానులకు ఈ తీపికబురు చెబుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ, ఈ వెటరన్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడంతో అర్జున్‌కు నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిందా? అని ఆన్లైన్లో ప్రశ్నలు సంధించడం మొదలెట్టారు.
ఈ నేపథ్యంలో తమ కుటుంబ విషయాన్ని రాద్ధాంతం చేయడం ఇష్టంలేని సచిన్ సోమవారం రిప్లై ఇచ్చాడు. కైండ్ ప్లమ్ 169 అనే యూజర్ అనుమానాన్ని నివృత్తి చేస్తూ.. అవును.. మా అబ్బాయి అర్జున్‌కు ఎంగేజ్మెంట్ అయింది. అతడి జీవితంలో కొత్త దశ మొదలుకాబోతున్నందున మేమంతా చాలా థ్రిల్ అవుతున్నాం అని మాస్టర్ బ్లాస్టర్ కామెంట్ చేశాడు. దాంతో.. సదరు యూజర్‌కే మాత్రమే కాదు చాలామందికి అనుమానం తీరిపోయింది. సచిన్ ధ్రువీకరించడంతో కాబోయే జంటకు శుభాకాంక్షలు అని పోస్ట్‌లు పెడుతున్నారు చాలామంది.
తెండూల్కర్ కుటుంబానికి కాబోయే కోడలు సానియాది వ్యాపార నేపథ్యమున్న కుటుంబం. తను సచిన్ తనయ సారాకు మంచి స్నేహితురాలు కూడా. 2020లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యేయేషన్ పూర్తి చేసిన సనా సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. జంతు ప్రేమికురాలైన తను ముంబైలోనే మిస్టర్ పాస్ పెట్ స్పా, స్టోర్ పేరుతో ఒక బొటిక్ తెరిచింది. సారా ద్వారా అర్జున్‌కు పరిచయం అయి సనా అతడిపై మనసు పారేసుకుంది. ఈ పేస్ గన్ సైతం ఆమెను ఇష్టపడ్డాడు.
ఇంకేముంది మనసులు కలవడంతో ఇరుకుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయిందీ యువజంట. కుటుంబసభ్యులు, ఆత్మీయుల సమక్షంలో అర్జున్, సనా నిశ్చితార్ధం ఒక ప్రైవేట్ వేడుకలా జరిగింది. అనంతరం సచిన్ ఫ్యామిలీతో కలిసి సారా ప్రారంభించిన పిలాటిస్ స్టూడియోస్ కార్యక్రమానికి హాజరైంది సనా.