Sachin 100 Centuries Record | విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు ఇప్పుడు భద్రంగా ఉందా? లేదా? అన్న చర్చ మొదలైంది. సచిన్ రికార్డును చేరుకునేది ఒకేఒక ప్లేయర్ విరాట్ మాత్రమేనని భావించారు. ఓ అవార్డుల ప్రదానోత్సవంలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్‌ను శత సెంచరీల రికార్డును ఏ ప్లేయర్ బద్దలు కొట్టగలడని ప్రశ్నించినప్పుడు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లను వెల్లడించాడు. ఆసక్తికరంగా వారం వ్యవధిలోనే ఇద్దరూ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
కోహ్లీ సోమవారం టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో 82 సెంచరీలు చేశాడు. కోహ్లీ సచిన్ రికార్డును సమం చేయడానికి కేవలం 18 సెంచరీల దూరంలో ఉన్నాడు. కోహ్లీ గత సంవత్సరం టీ20లకు సైతం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై భారత జట్టుకు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే విరాట్ కోహ్లీ కనిపించనున్నాడు. కోహ్లీ వన్డేల్లో గరిష్టంగా రెండేళ్ల వరకు మాత్రమే ఆడగలడని భావిస్తున్నారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో విరాట్ భవిష్యత్తుపై సైతం చర్చ జరుగుతుంది. సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు 19 సెంచరీలు చేయాల్సి ఉంటుంది. ఇది విరాట్ కోహ్లీకి కష్టమవుతుంది. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే సచిన్ శత సెంచరీల రికార్డును పదిలంగానే ఉండనున్నది. సచిన్ 200 టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. 463 వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. ఇక విరాట్ 123 టెస్టుల్లో 30 సెంచరీలు చేశాడు. అదే సమయంలో 302 వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. 125 టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 49 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 32, టీ20ల్లో ఐదు సెంచరీలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో టెండూల్కర్, కోహ్లీ ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ (71), శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర (63), దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కల్లిస్ (62), హషీమ్ ఆమ్లా (55), శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే (54) క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కోహ్లీ సమకాలీనులైన ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ (53), స్టీవ్ స్మిత్ (48), న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ (48) సైతం కెరియర్ చివరలో ఉన్నారు. ఈ దశలో వీరంతా సచిన్ శత సెంచరీల రికార్డును చేరుకునే అవకాశమే లేదని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.