SA Vs NZ | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి న్యూజిలాండ్ ప్రవేశించింది. ఈ నెల 9న భారత్‌తో ఫైనల్లో తలపడనున్నది. లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కేవలం డేవిడ్ మిల్లర్ మాత్రమే సెంచరీతో ఆకట్టుకున్నాడు.
లాహోర్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) రాణించారు. అలాగే, డారిల్ మిచేల్ (49), గ్లెన్ ఫిలిప్స్ (49) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడీకి మూడు, కగిసో రబడా రెండు వికెట్లు, వియాన్ ముల్డర్‌కు ఓ వికెట్ దక్కింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మొదట ఇన్నింగ్స్‌ను స్లోగా ప్రారంభించింది. తర్వాత రియాన్ రికిల్టన్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 12 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 17 పరుగులు చేసి పెలివియన్‌కు చేరాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌తో కలిసి కెప్టెన్ టెంబా బావుమా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బావుమా 71 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో వికెట్‌కు ఇద్దరు 105 పరుగులు జోడించారు. మరో వైపు డస్సెన్ 66 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 69 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మార్కరమ్ (36) పర్వాలేదనిపించినా.. క్లాసెన్ (3) తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యాడు. ఓ వైపు కివీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. దక్షిణాఫ్రికా బ్యాటర్లకు హిట్టింగ్‌కు ఛాన్స్ ఇవ్వలేదు.
ఓ వైపు వికెట్లు టపాటపా పడడంతో ఓటమి దిశగా కదిలింది. ముల్డర్ (8), కేశవ్ మహరాజ్ (1), రబాడా (16) పరుగులకే వెనుదిరిగారు. చివరలో డేవిడ్ మిల్లర్ సెంచరీతో చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 67 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో సెంచరీ నమోదు చేశాడు. డేవిడ్ మిల్లర్ రాణించడంతో దక్షిణాఫ్రికా కనీసం 300 స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్‌కు మూడు, గ్లెన్ ఫిలిప్‌కు రెండు, మాట్ హెన్రికి రెండు, బ్రాస్‌వెల్, రచిన్ రవీంద్రాకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో రాణించిన రచిన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.