SA vs AFG: వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీతేడాతో నెగ్గాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతులెత్తేసింది. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (107 బంతుల్లో 97 నాటౌట్, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అజ్మతుల్లా ఆదుకోవడంతో అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. మరి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను అఫ్గాన్ బౌలర్లు ఏ మేరకు కట్టడి చేయగలుగుతారు..? అన్నది ఆసక్తికరం.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (22 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్సర్), ఇబ్రహీం జద్రాన్ (30 బంతుల్లో 15, 3 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. కానీ నాలుగు పరుగుల వ్యవధిలో అఫ్గాన్ ఓపెనర్లతో పాటు కెప్టెన్ హష్మతుల్లా షాహిది (2) వికెట్లను కోల్పోయింది. 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ను రెహ్మత్ షా (46 బంతుల్లో 26, 2 ఫోర్లు), అజ్మతుల్లా ఆదుకునే యత్నం చేశారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించింది.
A run out off the last ball of the innings, and Azmatullah Omarzai is stranded on 97* 😮
Afghanistan were 116/6 at one point, but a spirited fightback means South Africa means 246 to win 🎯 https://t.co/5E3ISPlJRR #SAvAFG #CWC23 pic.twitter.com/nOdF9x2E0R
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2023
అర్థ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని లుంగి ఎంగిడి విడదీశాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇక్రామ్ అలిఖిల్ (12), మహ్మద్ నబీ (2), రషీద్ ఖాన్ (14)లు విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అజ్మతుల్లా మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేసిన అతడు 71 బంతుల్లో అర్థ సెంచరీపూర్తిచేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో అజ్మతుల్లాకు ఇది మూడో హాఫ్ సెంచరీ. రషీద్ ఖాన్ నిష్క్రమించగానే అఫ్గాన్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందని భావించినా లోయరార్డర్లో నూర్ అహ్మద్ (32 బంతుల్లో 26, 4 ఫోర్లు) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అజ్మతుల్లా – నూర్లు 8వ వికెట్‌కు 44 పరుగులు జోడించగా ఈ జోడీని కొయెట్జ్ విడదీశాడు.
అజ్మత్ సెంచరీ మిస్..
ఎంగిడి వేసుకున్న 47వ ఓవర్లో 4,6తో 80లలోకి వచ్చిన అజ్మతుల్లా.. అతడే వేసిన 49వ ఓవర్లో సిక్సర్ బాది 90లలోకి రావడంతో అందరి కళ్లూ అతడి సెంచరీ మీద పడ్డాయి. రబాడా వేసిన చివరి ఓవర్లో నవీన్ ఉల్ హక్ తొలి బంతికి సింగిల్ తీశాడు. అజ్మతుల్లా రెండో బాల్ కు సింగిల్‌కు రాగా మూడో బంతికీ నవీన్ ఒక్క పరుగు తీసి అజ్మత్కు స్ట్రైక్ ఇచ్చాడు. కానీ నాలుగు, ఐదో బంతికి పరుగు రాలేదు. ఆఖరి బంతికి నవీన్ ఉల్ హక్ రనౌట్ అవడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. సఫారీ బౌలర్లలో కొయెట్జ్ నాలుగు వికెట్లు తీయగా ఎంగిడి, మహారాజ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.