పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బెలారస్ బ్యూటీ ఎరీనా సబలెంకా వరుస విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగు తున్నది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో రెండో సీడ్ సబలెంకా 7-5, 6-1తో పౌలా బడోసా(స్పెయిన్)పై అలవోక విజయం సాధించింది. గంటా 17 నిమిషాల పాటు జరిగిన పోరులో సబలెంకాను దీటైన పోటీనిచ్చేందుకు బడోసా ప్రయత్నించింది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన బడోసా తొలి సెట్లో హోరాహోరీగా పోరాడింది. అయితే బలమైన ఫోర్‌హ్యాండ్, పదునైన ఏస్‌లతో విజృంభించిన సబలెంకా ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వలేదు. తొలి సెట్‌ను 7-5తో కైవసం చేసుకున్న ఈ రెండో సీడ్..మలి సెట్‌ను మరింత అలవోకగా తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో సబలెంకా 28 విన్నర్లు కొడితే..బడోసా 15కు పరిమితమైంది. అయితే 17 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడటం బడోసా ఓటమికి కారణమైంది. మిగతా మ్యాచ్‌ల్లో రిబకినా 6-4, 6-2తో మెర్టెన్స్పై, గ్రచెవా 7-5, 6-3తో బెగుపై విజయాలతో ముందంజ వేశారు.