చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. మరోసారి ఆ జట్టు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో జట్టు మేనేజ్మెంట్ మహేంద్రుడికే ఆ పగ్గాలు అప్పజెప్పింది. ఈ విషయాన్ని హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా గైక్వాడ్ గాయపడ్డా ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు ఆడాడు.
కానీ శుక్రవారం సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో కీలక మ్యాచ్‌కు ముందు గైక్వాడ్.. టోర్నీ నుంచి తప్పుకున్నట్టు సీఎస్కే తెలిపింది. ఇక 2023లో చెన్నైకి ఐదో ఐపీఎల్ ట్రోఫీ అందించిన తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. మళ్లీ కెప్టెన్‌గా ఆ జట్టు ను నడిపించనున్నాడు. రికార్డు స్థాయిలో సీఎస్కేను 235 మ్యాచ్‌లలో నడిపించిన ధోనీ.. ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింట్లో ఓడిన చెన్నైని ఏ మేరకు ఒడ్డుకు చేరుస్తాడనేది ఆసక్తికరం.
2022లో చెన్నై రవీంద్ర జడేజాను ధోనీ వారసుడిగా నియమించినప్పటికీ జడ్డూ సైతం సీజన్ మధ్యలో గాయంతో నిష్క్రమించగా ధోనీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పుడు జడేజాతో చెన్నై మేనేజ్మెంట్కు పొసగలేదని అందుకే అతడిని అర్ధాంతరంగా తప్పించారని వార్తలు వినిపించాయి. ఈ సీజన్లో కూడా చెన్నై పరిస్థితి దాదాపు 2022 మాదిరిగానే ఉంది. మరి గైక్వాడ్ నిజంగానే గాయపడ్డాడా? లేక జడ్డూ పరిస్థితే రిపీట్ అయిందా? అని క్రికెట్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.