IPL 2025 : సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) బ్యాటర్లు చెలరేగిపోయారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ సమిష్టింగా పంజా విసిరారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(35), కెప్టెన్ అజింక్యా రహానే(30)లు బలమైన పునాది వేశారు. అయితే మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ మందగించింది. అయితే.. డెత్ ఓవర్లలో ఆండ్రూ రస్సెల్(57 నాటౌట్) గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. అంగ్క్రిష్ రఘువంశీ(44)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 20వ ఓవర్లో రింకూ సింగ్(19 నాటౌట్) 4, 6, 6 బాదేయడంతో కోల్‌కతా స్కోర్ 200లు దాటింది. గత మ్యాచ్‌లో ముంబై పేస్ బౌలర్లకు దాసోహమైన రాజస్థాన్ టాపార్డర్ ఈసారి లక్ష్యాన్ని ఛేదిస్తుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక పోరులో భారీ స్కోర్ చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రహానే బృందానికి శుభారంభం దక్కలేదు. డేంజరస్ ఓపెనర్ సునీల్ నరైన్(11)ను యుధ్వీర్ సింగ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్(35)తో కలిసి కెప్టెన్ అజింక్యా రహానే(30) ధాటిగా ఆడాడు.
రాజస్థాన్ బౌలర్లను కౌంటర్ అటాక్ చేసిన ఈ జోడీ రెండో వికెట్‌కు 56 రన్స్ చేసింది. అయితే.. కీలక భాగస్వామ్యంతో కోల్‌కతా భారీ స్కోర్‌కు పునాది వేసిన ఈ జోడీని థీక్షణ విడదీశాడు. గుర్జాజ్ ఔటైన కాసేపటికే పరాగ్ ఓవర్లో వికెట్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు రహానే. దాంతో, 113 వద్ద మూడో వికెట్ పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ(44) బాధ్యతగా ఆడాడు.
రాజస్థాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయడంతో కోల్‌కతా స్కోర్ బోర్డు నిదానంగా సాగింది. అయితే.. 17వ ఓవర్ తర్వాత ఆండ్రూ రస్సెల్(57 నాటౌట్ : 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) గేర్ మార్చాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన అతడు ఆకాశ్ మధ్వాల్ ఓవర్లో వరుసగా 4, 6, 4 తో 15 రన్స్ సాధించాడు. ఆ తర్వాత ఆర్చర్‌కు చుక్కుల చూపిస్తూ 6, 4 బాదాడు.
రస్సెల్(57 నాటౌట్)
థీక్షణ వేసిన 18వ ఓవర్లో ఈ డాషింగ్ హిట్టర్ హ్యాట్రిక్ సిక్సర్లతో జట్టు స్కోర్ 160 దాటించాడు. నాలుగో వికెట్‌కు 32 బంతుల్లోనే 61 పరుగుల కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారిద్దరూ. 19వ ఓవర్ తొలి బంతికి పెద్ద షాట్ ఆడిన రఘువంశీ బౌండరీ లైన్ వద్ద సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అశోక్ శర్మ చేతికి చిక్కాడు. తన సహచరుడు ఔటైనా సరే రస్సెల్ మాత్రం జోరు తగ్గించలేదు. అదే ఓవర్లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. ఈ సీజన్లో ఈ చిచ్చరపిడుగుకు మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్(19 నాటౌట్) లెగ్ సైడ్ బౌండరీ, సిక్సర్ కొట్టడంతో కోల్‌కతా స్కోర్ 200 మార్క్ అందుకుంది. ఆ తర్వాత బంతిని కూడా రింకూ స్టాండ్స్‌లోకి పంపడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగలిగింది.