లాగొస్: హైదరాబాదీ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. నైజీరియాలోని లాగొస్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీజ.. 1-4 (7-11, 3-11, 4-11, 11-9, 11-13)తో జపాన్ ప్యాడ్లర్ హొనొక హషిమొటొ చేతిలో ఓడింది. ఈ టోర్నీలో అన్‌సీడెడ్ (57వ ర్యాంకు)గా బరిలోకి దిగిన శ్రీజ.. తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ప్లేయర్లను మట్టికరిపించి ఔరా అనిపించింది.
అయితే ఫైనల్లో ఆమె తడబాటుకు గురైంది. హషిమొటొ ఆరంభ గేమ్ నుంచే మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకుంది. నాలుగో గేమ్‌లో శ్రీజ పుంజుకుని.. ఐదో గేమ్‌లోనూ పోటీనిచ్చి ఒకదశలో 10-9తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివర్లో పుంజుకున్న జపాన్ అమ్మాయి.. 13-11తో గేమ్‌ను గెలుచుకుని టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన శ్రీజ.. 280 ర్యాంకింగ్ పాయింట్లనూ సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌లో సతియన్ జ్ఞానశేఖరన్-ఆకాశ్ పల్ ద్వయం.. 11-9, 11-4, 11-9తో టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం విదితమే.