Rudrankksh Patil : భారత యువ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ మరో మెడల్ సాధించాడు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) ప్రెసిడెంట్ కప్ మెన్స్ 10 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకం గెలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇటలీకి చెందిన డానిలో సొల్లాజోను 16-8తో ఓడించాడు. మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ మొదటి మూడు రౌండ్లలో గురి తప్పకుండా షూట్ చేసి 6-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత 10.9, 10.8, 10.7, 10.6 పాయింట్లు సాధించాడు. 12 రౌండ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే 10.5 మార్క్ కంటే తక్కువ పాయింట్లు వచ్చాయి.
రుద్రాంక్ష్, డానిల్లు గోల్డ్ మెడల్ కోసం పోటీపడడం ఇది రెండోసారి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా 10 మీటర్ల విభాగంలో రుద్రాంక్ష్, డానిలోపై విజయం సాధించాడు. ప్రెసిడెంట్ కప్ సెమీఫైనల్లో స్లోవేకియాకు చెందిన పత్రిక్ జానీని 16-10తో ఓడించాడు. ఆ విజయంతో రుద్రాంక్ష్ 2024 ప్యారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మనదేశం నుంచి ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న మొదటి షూటర్‌గా తనే కావడం విశేషం.