హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ మహిళా ఉద్యోగులు జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు జరిగిన రెండో జాతీయ మహిళా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2022లో టీఎస్ ఆర్టీసీ నుంచి పాల్గొన్న ఆరుగురు మహిళా ఉద్యోగులు మొత్తం 15 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. క్రీడల్లో ప్రావీ ణ్యం పొందిన వారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారని సజ్జనార్ అన్నారు. 5 స్వర్ణాలు, రజతం, 9 కాంస్య పతకాలు కైవసం చేసుకున్న సంస్థ ప్లేయర్లు మంజుల, శివలీల, సంగీత, సునీత, శ్రీదేవి, స్వరాజ్యలక్ష్మీని ఎండీ సజ్జనార్ అభినందించారు. 26 రాష్ట్రాల నుంచి మొత్తం 436 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో ఆర్టీసీ మహిళా సిబ్బంది సత్తా చాటడంపై సంతోషం వ్యక్తం చేశారు. డిసెంబర్లో మలేషియాలో నిర్వహించనున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో ఆర్టీసీ నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ కృష్ణకాంత్, టీమ్ ఫిజియోథెరఫిస్ట్ హేమాంశ్ కుమార్, మేనేజర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.