IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ సీజన్ కోసం బీసీసీఐ కొత్తగా మూడు రూల్స్‌ని తీసుకువచ్చిన విషయం తొలిసిందే. బీసీసీఐ తెచ్చిన రూల్స్‌లో ఒకటి ‘రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి’. తొలిసారిగా ఈ రూల్‌ని బుధవారం రాజస్థాన్ రాయల్స్ – కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండో బాల్ రూల్‌ని తొలిసారి అమలు చేశారు. తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్.. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బంతిని మార్చాలని అంపైర్లను కోరింది. కొత్త బంతిని తీసుకున్నా.. కేకేఆర్ చేతిలో రాజస్థాన్ పరాజయం పాలైంది. రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ 61 బంతుల్లో 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఈ సీజన్లో కొత్తగా బీసీసీఐ సెకండ్ బాల్ రూల్‌ని పరిచయం చేసింది. సాయంత్రం జరిగే మ్యాచులకు రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ నుంచి కొత్త బంతి ఇస్తారు. అయితే, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మంచును పరిగణనలోకి తీసుకుని కొత్త బంతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ రూల్ మధ్యాహ్నం మ్యాచ్‌లకు వర్తించదు. రాత్రి మ్యాచుల్లో మంచు ప్రభావాన్ని తగ్గించే విషయంలో సెకండ్ బాల్ రూల్‌ని ప్రవేశపెట్టింది. మంచు కారణంగా బౌలర్లు బంతిని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు, టార్గెట్ సయయంలో వారికి భారీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ రాత్రి మ్యాచుల్లో రెండో బంతిని ఉపయోగించడానికి అనుమతించే రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది. రూల్ ప్రకారం.. రెండవ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మైదానంలో ఉన్న అంపైర్ బంతి పరిస్థితిని అంచనా వేస్తారు. అధిక మంచు కురుస్తున్నట్లు గుర్తిస్తే.. ఫీల్డింగ్ జట్టుకు కొత్త బంతిని ఉపయోగించేందుకు అనుమతి ఇస్తారు. మ్యాచ్ మళ్లీ కొత్త బంతిని ఉపయోగించడం బౌలర్లకు అనుకూలించే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, కేకేఆర్ బ్యాటింగ్ 17వ ఓవర్ సమయంలో.. రాజస్థాన్ రాయల్స్ కొత్త రూల్‌ని వాడింది. అయినా, మ్యాచ్‌లో పరాజయం పాలైంది.
క్లిష్టమైన వికెట్‌పై కేకేఆర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అజేయంగా 97 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లు వరుణ్ 17 పరుగులకు రెండు, మోయిన్ అలీ 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్థాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మొయిన్ అలీ (5), కెప్టెన్ అజింక్య రహానే (18) వికెట్లను త్వరగానే కోల్పోయిన కేకేఆర్‌ను.. రఘువంశి (22)తో కలిసి క్వింటన్ డికాక్ గెలిపించాడు. డికాక్ 61 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది బౌండరీల సహాయంతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.