BCCI | టీమిండియా మాజీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీలో సభ్యులు ఎంపికైనట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్రస్తుత ప్యానెల్ ఎస్ శరత్ కుమార్, సుబ్రతో బెనర్సీ స్థానంలో వీరిని నియమించినట్లు తెలుస్తున్నది. బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇద్దరి పేర్లను సూచించింది. బోర్డు ఎంజీఎం ఇద్దరి పేర్లను ఆమోదించనున్నది. ఈ ఇద్దరు కలిసి అజీత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పని చేయనున్నారు. జూనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఎస్ శరత్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.
2007లో టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన హీరోల్లో ఆర్పీసింగ్ ఒకడు. టెస్టుల్లోనూ భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. సెంట్రల్ జోన్ నుంచి వచ్చిన ఈ మాజీ ఆటగాడు ఉత్తర ప్రదేశ్ తరఫున ఎక్కువగా క్రికెట్ ఆడాడు. 2016-17లో రంజీ ట్రోఫీని గెలిచిన గుజరాత్ జట్టులో సభ్యుడు. ఈ సంవత్సరం ఆర్పీసింగ్‌కు 40 ఏళ్లు నిండనున్నాయి. ఆర్పీసింగ్ టీమిండియా తరఫున మొత్తం 82 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 124 వికెట్లు తీశాడు. ఇందులో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మాజీ బౌలర్ సుబ్రతో బెనర్జీ స్థానంలో సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
హైదరాబాదీ మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓఠా సైతం సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఓఝా టెస్ట్ స్పెషలిస్ట్. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున 144 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 113 వికెట్లు టెస్టుల్లో తీశాడు. 21 వన్డేల్లో, టీ20 పది వికెట్లు తీశాడు. విశేషం ఏంటంటే.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో పదవి వికెట్లు కూల్చి వార్తల్లో నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఎక్కువగా ఓఝా హైదరాబాద్ తరఫున ఆడాడు. అలాగే, బెంగాల్, బిహార్ జట్ల తరఫున ఆడాడు. ఇక శరత్ స్థానంలో సెలెక్టర్‌గా పని చేయనున్నాడు.