న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(Royal Challengers Bengaluru) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెండు ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ కంపెనీ డియాజియో.. అమ్మకానికి చెందిన ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా ఆ కంపెనీ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకానికి చెందిన విషయాన్ని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు వెల్లించారు.
రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులకు చెందిన సమీక్ష జరుగుతున్నట్లు డియాజియో సంస్థ పేర్కొన్నది. ఆర్సీబీ లో ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల కోసం ఆర్సీబీని అమ్మే ప్రక్రియ మొత్తం 2026, మార్చి 31వ తేదీ వరకు ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలోని రెగ్యులేషన్ 30 ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్కు లేఖ రాసినట్లు డియాజియో, యూఎస్ఎల్ పేర్కొన్నాయి.
ఆర్సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలైన అదానీ గ్రూపు, జీఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూపు, ఆదార్ పూనావాలాకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీలోని రవి జైపురియాకు చెందిన దేవయాని ఇంటర్నేషనల్ గ్రూపు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.