Cristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఇప్పటికీ కుర్రాడిని తలపిస్తున్నాడు. మైదానంలో దిగితే గోల్స్ పండగే అన్నట్టుగా ఆడుతున్నాడీ సాకర్ వెటరన్. నలభై ఏళ్ల వయసులో అతడు చిరుతలా గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ (Al Nassr) తరఫున చెలరేగిపోతున్న రొనాల్డో తాజాగా కళ్లు చెదిరే బైస్కిల్ కిక్ (Bicycle Kick) కొట్టాడు. సహచరుడు ఫార్వర్డ్ చేసిన బంతిని గాల్లోకి లేచి కుడికాలితో అమాంతం ప్రత్యర్ధి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ప్రస్తుతం అతడి సూపర్ గోల్ ఇంటర్నెట్లో వైరలవుతోంది.
మూడేళ్ల క్రితం ఫిఫా వరల్డ్ కప్ తర్వాత అల్ నస్రీకి మారిన రొనాల్డో ఆ క్లబ్ గెలుపు గుర్రంగా అవతరించాడు. సౌదీ క్లబ్ విజయాల్లో కీలకం అవుతున్న ఈ ఫార్వర్డ్ ఆటగాడు.. నవంబర్ 23 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. రియాద్ వేదికగా ‘అల్ అవ్వాల్’ (Al Awwal) జట్టు డిఫెన్స్‌ను ఛేదించిన రొనాల్డో.. బైస్కిల్ కిక్ కొట్టాడు. అనంతరం తనదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాడీ స్టార్ ప్లేయర్. అతడలా గోల్ చేయడంతో స్టాండ్స్‌లోని అభిమానులు ఉర్రూతలూగిపోయారు. టీవీ ప్రజెంటర్ అయితే ఆ బైస్కిల్ గోల్‌కు ఫిదా అయిపోయాడు.
Call it skill, call it instinct… we call it Ronaldo 🐐💛 pic.twitter.com/diFN85oBCI
— AlNassr FC (@AlNassrFC_EN) November 23, 2025
ఈ రోజు రాత్రి ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. నా సహచరుడు రొనాల్డో మరో అద్భుతమైన బైస్కిల్ కిక్ సాధించాడు. అతడికి ఇప్పుడు 40. ఈ వయసులో కుర్రాడిలా రొనాల్డో చేసిన గోల్ నమ్మశక్యం కాదు అని పియెర్స్ మోర్గాన్ అన్నాడు. రొనాల్డో చేసిన ఈ గోల్ వచ్చే ఏడాది ఫిఫా పుస్కాస్ అవార్డుకు నామినేట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఈ బైస్కిల్ గోల్‌తో రొనాల్డో వెయ్యి క్లబ్‌కు చేరువయ్యాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 954 గోల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఐదుసార్లు ‘బాలన్ డీ ఓర్’ అవార్డులు అందుకున్న ఈ దిగ్గజం.. వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
