Paris Olympics : ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలి రోజే ఒక అథ్లెట్ డోప్ పరీక్ష(DopingTest)లో పట్టుబడింది. రొమేనియాకు చెందిన లాంగ్ జంపర్ ఫ్లోరెంటినా లస్కో(Florentina Lusco) డోప్ టెస్టులో ఫెయిల్ అయింది. దాంతో, గురువారం ప్రపంచ డ్రగ్స్ నిరోధక సంస్థ అధికారులు ఆమెపై నిషేధం విధించారు. ఫ్లోరెంటినా నిషేధిత డైయురెటిక్ (Diuretic) అనే డ్రగ్ తీసుకున్నట్టు గుర్తించారు. 2023 ఏప్రిల్లో డైయురెటిక్ను వాడా నిషేధిత డ్రగ్స్ జాబితాలో చేర్చింది.
ఒలింపిక్స్ విలేజ్లోని వాడా అధికారులు ఫ్లొరెంటీనాకు డోపింగ్ టెస్టు చేశారు. ఆమె నుంచి సేకరించిన శాంపిల్ ‘ఏ’, శాంపిల్ ‘బి’లను పరీక్షించగా రెండూ డైయురెటిక్ డ్రగ్కు పాజిటివ్ వచ్చాయి. దాంతో, మాదకద్రవ్యాల నిరోధక చట్టం ఉల్లంఘనకు పాల్పడిన ఫ్లొరెంటనాపై వాడా కఠిన చర్యలు తీసుకుంది. విశ్వ క్రీడల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది.

పారిస్ ఒలింపిక్స్లో ఫ్లొరెంటిన లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీలకు ఎంపికైంది. కానీ, నిషేధిత డ్రగ్ తీసుకోవడం ఆమె పాలిట శాపమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొమేనియా ప్రభుత్వం ఫ్లొరెంటినాకు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, ఐదు నెలల్లోనే ఆమె డోప్ పరీక్షలో పట్టుబడడం గమనార్హం.