Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ షామా మొహమ్మద్ (Shama Mahammad) బాడీ షేమింగ్ (Body Shaming) కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మ చాలా లావుగా ఉంటాడని, ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడని, సచిన్, ద్రవిడ్, గంగూలీ, కోహ్లీ, ధోనీలతో పోల్చితే ఆయన జస్ట్ యావరేజ్ ఆటగాడని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వహించిన వారిలో అంతగా ఆకట్టుకోలేని కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమేనని షామా కామెంట్ చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకురాలు తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. అయినా షామా మహ్మద్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది.
షామా కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి సానుకూల, ప్రతికూల స్పందనలు వస్తున్నాయి. షామా అభిమానులు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. పలువురు క్రికెట్ ప్రేమికులు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.