చెన్నై: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం తమకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏం అవసరం లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ స్పష్టం చేశాడు. మిగతా జట్ల లాగే బంగ్లాను ప్రత్యర్థిగా ఎదుర్కొంటామని అన్నాడు. తొలి టెస్టు పోరు కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా భేటీలో రోహిత్ పలు అంశాలపై మాట్లాడాడు. ‘ప్రతీ జట్టు భారత్‌ను ఓడించాలనుకుంటున్నది. తద్వారా ఘనత సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ ఉత్సాహాన్ని వాళ్లు అస్వాదించని. కానీ మా వరకు మ్యాచ్‌లు ఎలా గెలువాలన్నదే దానిపై మా దృష్టంతా. మా గురించి ప్రత్యర్థి ఏం ఆలోచిస్తుందన్న దానిపై మేము ఆలోచించం. ఇప్పటికే ప్రపంచంలోఇని ప్రతీ జట్టుతో భారత్ మ్యాచ్‌లు ఆడింది. ఇప్పటికిప్పుడు బంగ్లా కోసం ప్రత్యేకమైన వ్యూహం అవసరం లేదు. కొంతమంది కొత్త క్రికెటర్లు బాగా రాణిస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కొవాలనే దానిపై మా గేమ్‌ప్లాన్ మాకుంది. కీలకమైన బౌలర్ల పని ఒత్తిడిని నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాం. రానున్న సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి కల్పిస్తాం. టెస్టు సిరీస్‌లకు ముందు దులీప్ ట్రోఫీ ఏర్పాటు చేయడం బాగుంది. దీని ద్వారా చాలా మంది క్రికెటర్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికింది’ అని అన్నాడు.