గువాహటి: యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఇద్దరు ఓపెనర్లు చాలా బాగా ఆడుతున్నారు. అయితే గత కొన్ని మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించిన గిల్‌నే ఓపెనర్‌గా ఆడించాలనుకుంటున్నాం. ఇషాన్ బాధపడాల్సిన అవసరం లేదు.
చివరి వన్డేలో అతడు ద్విశతకం చేశాడు. సూర్య, శ్రేయస్‌లో ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకోవడం చాల కష్టమైన పని. అయితే పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. టీ20లతో పోలిస్తే వన్డేలు కాస్త భిన్నమైనవి. ఇక్కడ దూకుడుతో పాటు సంయమనం అవసరం’అని అన్నాడు. మరోవైపు బుమ్రా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘లంకతో వన్డే సిరీస్‌లో బుమ్రా ఆడటం లేదు.
ఈ సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడని ముందే పేర్కొన్నా.. కోలుకునేందుకు ఇంకాస్త సమయం ఇస్తే మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’అని బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుమ్రా గైర్హాజరీలో షమీ కీలకం కానున్నాడని రోహిత్ తెలిపాడు. లంకతో టీ20 సిరీస్‌కు దూరమైన రోహిత్.. ఇక పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడనే ఊహగనాలకు హిట్‌మ్యాన్ చెక్ పెట్టాడు. ‘ఈ ఏడాది భారత జట్టు తక్కువ టీ20లు ఆడనుంది. ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత కుర్రాళ్ల ప్రదర్శన ఎలా ఉందో పరిశీలిస్తాం. ప్రస్తుతానికి టీ20ల నుంచి తప్పుకునే ఆలోచన లేదు. ప్రస్తుతానికి ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాం’అని రోహిత్ స్పష్టం చేశాడు.