ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ తన స్థాయికి తగినట్టుగా రాణించలేకపోయాడు. దాంతో అతని ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. కొందరు క్రికెటర్లు అతనికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ కూడా అలాంటి సూచనే చేశాడు.
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించాడు. కెప్టెన్గా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడని డౌల్ చెప్పా డు. భారత జట్టు కెప్టెన్ కూడా అయిన రోహిత్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను వదులుకుంటే వ్యక్తిగతంగా రాణించే అవకాశం ఉందని డౌల్ సలహా ఇచ్చాడు.
అందుకు టీమిండియా మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన అతనంతరం విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని, స్వేచ్ఛగా ఆడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నాడని చెప్పాడు. రోహిత్ కూడా అదే సూత్రాన్ని పాటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.