చిన్న చిన్న పరాజయాలకే రాకెట్ నేలకేసి కొట్టడం.. అంపైర్లతో దురుసుగా ప్రవర్తించడం.. ప్రత్యర్థికి కనీస మర్యాద ఇవ్వకపోవడం.. ఇలా ఎన్నెన్నో విచిత్రాలు
సాగుతున్న సమయంలో మైదానంలో అడుగుపెట్టిన ఆ నూనూగు మీసాల కుర్రాడు.. సుదీర్ఘ కెరీర్లో మచ్చుకైనా అసహనానికి గురికాకుండానే కెరీర్ ముగించాడు. ఏడేండ్ల ప్రాయంలో బాల్‌బాయ్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆ చిన్నోడు.. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు పర్యాయ పదంలా మారి రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని తన రికార్డులతో మంత్ర ముగ్ధులను చేశాడు.
అతడు సర్వీస్ చేస్తే బంతి శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్లా దూసుకెళ్తుంది! అతడు రిటర్న్ షాట్ ఆడితే న్యూటన్ మూడో సూత్రం అప్లయ్ అవుతుంది!! అతడు డ్రాప్ షాట్ ఆడితే బంతి సూఫీ నృత్యం చేస్తూ నేలను ముద్దాడుతుంది! అతడు స్మాష్ కొడితే బంతి స్పార్టన్ వీరుడు విసిరిన బల్లెంలా లక్ష్యాన్ని ఛేదిస్తుంది!! గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. శిల్పానికి ప్రాణం పోస్తున్నట్లు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేసే ఇంద్రజాలికుడిలా.. 24 ఏండ్ల పాటు అభిమానులను తన విన్యాసాలతో ఓలలాడించిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు కోట్లాది మంది హృదయాలను గెలిచిన స్విట్జర్లాండ్ దిగ్గజం కెరీర్‌ను ఓసారి పరికించి చూస్తే..
ప్రపంచ క్రీడా ప్రస్థానపు చరిత్ర పుటల్ని తిరగేస్తే.. బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ నుంచి క్రికెట్ దిగ్గజం సర్ డాన్‌బ్రాడ్‌మన్ వరకు.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ నుంచి సాకార్ వీరుడు డిగో మారడోనా వరకు.. గ్రేట్ రేసర్ షూమాకర్ నుంచి.. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వరకు.. స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ఫ్స్ నుంచి వేగానికి మారుపేరైన ఉసేన్ బోల్ట్ వరకు ఎందరో మహామహుల పేర్లు కనిపిస్తాయి. ఈ మేటీ క్రీడాకారులందరిలో శిఖరాగ్రాన నిలిచే క్రీడా యోధుడు ఎవరు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా నిర్వహించిన అనేకానేక మేధోమధనాల్లో, సర్వేల్లో మెజారిటీ క్రీడాప్రేమికులు ఫెదరర్‌కే అగ్రతాంబూలమిచ్చి తమ గుండెల్లో గుడి కట్టారు.
ఆర్మీ కమాండర్లా..
యుద్ధ సమయాల్లో ఎదురు దాడికి దిగి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టడం, అవసరమైతే వెనక్కి తగ్గి అదును చూసి దెబ్బతీయడం అనే రెండు వ్యూహాలు సహజం. ఈ యుద్ధ కళను టెన్నిస్ రణరంగంలో అత్యంత పకడ్బందీగా ఆచరణలో పెట్టిన ఫెదరర్‌ను మిలిటరీ కమాండర్ అనకుండా ఉండగలమా! స్వతహాగా ఎదురుదాడిని ఇష్టపడే ఫెదరర్.. అవసరమైతే బ్యాక్‌హ్యాండ్ సాయంతో సుదీర్ఘ ర్యాలీలు ఆడి ప్రత్యర్థిని అలిసిపోయేలా చేసి విరుచుకుపడటంలోనూ ధిట్టే. టెన్నిస్‌లో అతడు ఆడని షాట్ లేదు, అతడు గెలువని ట్రోఫీ లేదు, అధిరోహించని శిఖరం లేదు. ఆర్జించని పేరు లేదు.. అయినా ఏనాడు అహంభావాన్ని తలకెక్కించుకోని ఫెదరర్‌ను అత్యంత స్థితప్రజ్ఞుడు కాక ఇంకేం అనగలం! ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఉగ్గుపాలతో ఒంట పట్టించుకున్న రోజర్.. హుందాతనాన్నే ఆభరణంగా ధరించాడు. ఒలింపిక్స్ వంటి మెగాటోర్నీల్లో ఏ అభిమానైనా.. తమ దేశ క్రీడాకారులే గెలువాలని కోరుకోవడం సహజం. కానీ ఫెదరర్ విషయంలో మాత్రం ఇది మినహాయింపు.
ఒడిదుడుకులెన్నో..
సుదీర్ఘ కెరీర్లో ఫెదరర్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించాడా అంటే అదీ లేదు. అందరు క్రీడాకారుల్లాగే అతడు కెరీర్లోనూ ఎత్తుపల్లాలు ఎన్నో! అనేక సార్లు గాయాల పాలయ్యాడు.. అనామకుల చేతుల్లోనూ ఖంగుతిన్నాడు.. విమర్శల ధాటిని ఎదుర్కొన్నాడు. అయినా సరే ఏనాడు కుంగిపోలేదు. నిరాశా నిస్పృహల ఊబిలో కూరుకుపోలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. పడ్డ చోటే ఫీనిక్స్ పక్షిలా పైకి లేచాడు. కెరీర్, కుటుంబం అనే రెండు పడవల ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేయొ చ్చో ఆచరణలో చూపి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
మచ్చలేని మనిషి
విజయం పేరుతో పాటు.. అవార్డులు, డబ్బు, హోదా అభిమానం ఇలా ఎన్నింటినో చెంతకు చేరుస్తుంది. క్రీడల్లో శిఖరాగ్రాలను అధిరోహించి ఏదో ఓ బలహీనతతో పతనావస్థను చవిచూసిన మేటి క్రీడాకారులెందరో. టైగర్ వుడ్స్, మైక్ టైసన్, మరియా షరపోవా, పిస్టోరియస్ ఇలా ఎందరో గెలుపు తెచ్చిపెట్టిన మత్తులో పతనపు అంచులు చవిచూశారు. టెన్నిస్‌కు పర్యాయపదంగా మారిన ఫెదరర్… అగ్రస్థానం, అవార్డులు, ఆర్జనలు, పేరు ప్రతిష్ఠలు ఇలాంటివి లెక్కలేనన్ని మూటగట్టుకున్నా ఏనాడూ ఏ తప్పూ చేయలేదు. ఓ మనిషి తన వృత్తినే ప్రవృత్తిగా మలచుకుని ప్రాణప్రదంగా ప్రేమించి శ్రమిస్తే హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతాడనడానికి ఫెదరర్ ఒక చక్కటి ఉదాహరణ!