Rizwan : ఆటతో కంటే వివాదాలతోనే వార్తల్లో నిలిచే పాకిస్థాన్ క్రికెట్ జట్టు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల ఆ దేశ బోర్డు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను మాజీ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) తిరస్కరించడం పెద్ద దుమారం రేపుతోంది. పాక్ క్రికెట్ బోర్డు సవరించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌పై పెదవి విరుస్తున్న ఈ స్టార్ బ్యాటర్.. సీనియర్ అయిన తనకు ఏ కేటగిరీ కేటాయించాలని కోరాడు. అంతేకాదు తన డిమాండ్లకు అంగీకరిస్తేనే కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తానని బోర్డు పెద్దలకు విషయం స్పష్టంగా చెప్పాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టులను సవరిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్లేయర్లు బాబర్, రిజ్వాన్, ఆఫ్రిదిలకు మాత్రమే ఉన్న ఏ కేటగిరీని రద్దు చేసింది. గత ఏడాది కాలంగా ఈ ముగ్గురి ప్రదర్శన ఏమంత గొప్పగా లేనందున ఈ ముగ్గురిని కూడా కేటగిరీ బీలో చేర్చింది. రిజ్వాన్ సహా మొత్తం 10 మందిని ఈ కేటగిరీలోకి తీసుకుంది బోర్డు. అందరూ సంతకాలు చేయగా అతడు మాత్రం తిరస్కరించాడు. తనన కాదని షాహీన్ ఆఫ్రిదికి వన్డే సారథ్యం అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న రిజ్వాన్.. పీసీబీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచాడు.
🚨 Mohammad Rizwan has not yet signed the central contract.
– He has set certain conditions, asking for an explanation on why he was dropped from the national T20 squad.
– All other 29 players have signed the contract, but Rizwan hasn’t so far. ( Qadir Khawaja) pic.twitter.com/nHdv81EP5r
— junaiz (@dhillow_) October 28, 2025
‘సీనియర్లకు ఇంతకుముందున్న ఏ కేటగిరీని కేటాయించాలి. ఎవరినైనా కెప్టెన్‌గా నియమించే ముందు అతడిని ఎంత వరకూ ఉంచుతారు? అనేది స్పష్టంగా చెప్పాలి. అలానే.. అతడు తన ప్రణాళికలను అమలు చేసేందుకు తగినంత సమయం ఇవ్వాలి అని రిజ్వాన్ కొన్ని షరతులు పెట్టాడు. వీటికి అంగీకరిస్తేనే సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తానని బోర్డుకు తెలియజేశాడు. ఒకప్పుడు టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన రిజ్వాన్ ఇప్పుడు జట్టులో చోటుకోసం నిరీక్షిస్తున్నాడు. నిరుడు డిసెంబర్ నుంచి అతడు పొట్టి జట్టులోకి రాలేదు.
బీ కేటగిరీలో వీళ్లే : బాబర్ అజాం, ఫఖర్ జమాన్, అబ్రార్ అహ్మద్, హ్యారిస్ రవుఫ్, రిజ్వాన్, హసన్ అలీ, సయీం ఆయూబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహన్ ఆఫ్రిది. వీళ్లకు పీసీబీ ప్రతినెలా రూ.30 లక్షలు చెల్లించనుంది.