Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఘోరంగా విఫలమైన రిషభ్ పంత్ (Rishabh Pant) కీలక నిర్ణయం తీసుకున్నాడు. రికార్డు ధర(రూ. 27 కోట్లు)కు తనను కొన్న జట్టుకు న్యాయం చేయలేకపోయిన అతడు కెప్టెన్‌గా వైదొలిగాడు. 19వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) చెత్త ఆటతో అట్టడుగున నిలవడంతో తనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఫ్రాంచైజీని కోరాడు పంత్. అతడి అభ్యర్థనను ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్నో యాజమాన్యం అంగీకరించింది. సారథ్య బాధ్యతల నుంచి పంత్ తప్పుకున్నాడని తమ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది లక్నో టీమ్.
వరసగా రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌ను ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయిన రిషభ్ పంత్ కెప్టెన్సీ వదులుకున్నాడు. 19వ సీజన్లో ఎల్ఎస్జీ పరమ చెత్త ఆటకు బాధ్యత తీసుకుంటూ తనను సారథిగా తొలగించాలని యాజమ్యాన్ని పంత్ అభ్యర్థించాడు. శుక్రవారం అతడు ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ దృష్టికి తీసుకెళ్లగా.. అతడు ఆమోదముద్ర వేశాడు.
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
‘తనను సారథిగా తప్పించాలని రిషభ్ పంత్ ఫ్రాంచైజీని అభ్యర్థించాడు. అతడి నిర్ణయాన్ని ఫ్రాంచైజీ అంగీకరించింది’ అని టామ్ మూడీ తెలిపాడు. ‘లక్నో కెప్టెన్‌గా తనను తప్పించాలని రిషభ్ పంత్ ఫ్రాంచైజీని కోరాడు. అతడి అభ్యర్ధనను ఫ్రాంచైజీ అంగీకరించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సులభమేమీ కాదు. డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్‌గా పంత్ సేవలకు ధన్యవాదాలు. అత్యుత్తమ ప్రమాణాలు అందుకునేందుకు సమిష్టిగా.. మరింత ద్రుఢంగా తిరిగి రావడంపై దృష్టి సారిస్తాం’ అని లక్నో ఫ్రాంచైజీ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఆరంభ సీజన్ నుంచి వరసగా ప్లే ఆఫ్స్ వెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌ను రిషభ్ పంత్ ముందుకు తీసుకెళ్లడంలో నూరుకు నూరు శాతం విఫలమయ్యాడు. ఫలితంగా 19వ సీజన్లో లక్నో పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచుల్లో పదింట ఓడిన పంత్ సేన పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

కెప్టెన్‌గా జట్టును ముందుండి నడపాల్సిన పంత్ మరీ దారుణంగా 312 పరుగులే చేశాడు. మిడిలార్డర్లో అతడు ధాటిగా ఆడలేకపోవడం, భాగస్వామ్యాలు నిర్మించలేకపోవడం లక్నో విజయావకాశాల్ని దెబ్బతీశాయి. దాంతో, ఊహించినట్టుగానే ఫ్రాంచైజీ కంటే ముందే అతడే తనను సారథిగా తొలగించాలని అభ్యర్థించాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో ఇప్పటికే పంత్ టెస్టుల్లో టీమిండియా వైస్ కెప్టెన్సీ పోగొట్టుకున్న విషయం తెలిసిందే.