Rishabh Pant : సుదీర్ఘ ఫార్మాట్లో సూపర్ స్టార్ అనిపించుకుంటున్న భారత క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) మైదానంలో ఉన్నాడంటే ఆ సందడే వేరు. బ్యాట్‌తో ప్రత్యర్థుల భరతం పట్టే అతడు.. వికెట్ల వెనకాల చురుగ్గా కదులుతూ ‘వారెవా’ అనిపిస్తాడు. టీమిండియాకు గిఫ్టెడ్ ప్లేయర్లా దొరికిన పంత్ ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా తన రికవరీపై అప్డేట్ ఇచ్చాడీ చిచ్చరపిడుగు.
ఇంగ్లండ్ గడ్డపై చివరి టెస్టుకు, కొన్ని రోజులు ఆటకు తనను దూరం చేసిన పాదం గాయం ఏమాత్రం తనకు నచ్చడం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడీ డాషింగ్ బ్యాటర్. గురువారం పంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘నేను దీన్ని చాలా ద్వేషిస్తున్నాను’ అంటూ పట్టీతో ఉన్న తన కుడి పాదం ఫొటోను పంచుకున్నాడీ వైస్ కెప్టెన్. అతడి పోస్ట్ చూసిన అభిమానులు పంత్.. వి మిస్ యూ.. నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ (Chris Woakes) బంతిని స్వీప్ షాట్ ఆడబోయి గాయపడ్డాడు పంత్. మెరుపు వేగంతో వచ్చిన ఆ బంతి అతడి కుడి పాదం చివరి వేళ్లకు బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడు. ఫిజియో వచ్చి పరీక్షించాక రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్ చేరిన పంత్.. శార్ధూల్ ఠాకూర్ వికెట్ పడ్డాక కుంటుతూనే క్రీజులోకి వచాడు. టెయిలెండర్ల సాయంతో స్కోర్ బోర్డును నడిపించిన పంత్.. కార్సే ఓవర్లో సిక్సర్ బాది.. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. వైద్య పరీక్షల తర్వాత ఎముక విరిగిందని తెలిసినా టీమ్ కోసం మైదానంలోకి దిగిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
పంత్ సంచరీ అభివాదం..
కానీ.. జడేజా, సుందర్‌లు అజేయ శతకాలతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయితే.. గాయం తీవ్రత కారణంగా పంత్ చివరిదైన ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై తనదైన శైలిలో దుమ్మురేపిన ఈ విధ్వంసక బ్యాటర్ హెడింగ్లే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో చరిత్ర సృష్టించాడు. మొత్తంగా అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి 479 పరుగులతో రాణించాడు.