గువాహతి: ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భారత వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. టెస్టు జట్టు వెస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వచ్చే నెలలోఆఫ్ఘానిస్థాన్తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్ సెలెక్షన్ కమిటీ మంగళవారం వేర్వేరు జట్లను ప్రకటించింది. గిల్ కెప్టెన్సీలోని ఇరు జట్లలో నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటు ఇచ్చిన కమిటీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి పంత్‌ను తప్పించి ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. ఇకపై టెస్టుల్లో పంత్ కేవలం కీపర్, బ్యాటర్‌గానే ఉంటాడు.
వన్డే జట్టులో తను పూర్తిగా చోటు కోల్పోయాడు. వన్డేల్లో రాహుల్‌తో పాటు రెండో కీపర్‌గా ఇషాన్ కిషన్ పునరాగమనం చేశాడు. పంత్ వైట్ బాల్ క్రికెట్ ప్రణాళికల్లో ప్రస్తుతానికి లేడనే విషయాన్ని అగార్కర్ పరోక్షంగా స్పష్టం చేస్తూ.. అతను టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెట్టాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టుతో పాటు వన్డే సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. రాబోయే ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్టు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తెలిపాడు.
భవిష్యత్తు అవసరాలను, 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు స్పిన్ విభాగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చినట్లు స్పష్టం చేసిన అగార్కర్.. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను రెండు జట్ల నుంచి తప్పించాడు. బంతిని టర్న్ చేయడంలో అక్షర్ విఫలమవడం, బ్యాటింగ్ ఫామ్ క్షీణించడమే దీనికి కారణమని తెలుస్తోంది. జడ్డూ, అక్షర్ స్థానాల్లో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ద్వయం మానవ్ సుతార్, హర్ష్ దూబేను టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. దూబే వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు.
అలాగే, ఈ రంజీ సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన 6.6 అడుగుల పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు రెండు జట్లలో అవకాశం కల్పించారు. ఐపీఎల్లో ఆకట్టుకుంటున్న లకో యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ వన్డే జట్టులోకి వచ్చాడు. ముల్లన్పూర్ వేదికగా జూన్ 6న టెస్టు మ్యాచ్ జరగనుండగా.. అదే నెల 13, 17, 20వ తేదీల్లో వరుసగా ధర్మశాల, లక్నో, చెన్నైలో మూడు వన్డేలు షెడ్యూల్ చేశారు. కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న లెజెండరీ క్రికెటర్లు రోహిత్ వర్మ, విరాట్ కోహ్లీని వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని సెలెక్టర్లు తెలిపారు.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్ (కీపర్).
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.