బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు రసపట్టులో పడింది. ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై బౌలర్లు వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. రెండో రోజైన శనివారం ఆటలో 15 వికెట్లు నేలకూలాయి. బోలాండ్ ధాటికి టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో కంగారూలకు ముచ్చెమటలు పట్టించాడు. టాపార్డర్ మరోమారు ఘోరంగా విఫలం కాగా,పంత్ ఒంటరిపోరాటం జట్టుకు కలిసొచ్చింది. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా పంత్ కొట్టిన షాట్లకు కిక్కిరిసిన సిడ్నీ స్టేడియం హోరెత్తిపోయింది. అంతకుముందు ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, నితీశ్, బుమ్రా విజృంభణతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు పరిమితమైంది. అరంగేట్రం బ్యాటర్ వెబ్‌స్టర్ అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతావారు విఫలమయ్యారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో విజయం ఎవరిదో అన్నది ఆసక్తికరగా మారింది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. మ్యాచ్‌కు ముందే ఆసక్తి రేపిన పోరులో భారత్, ఆస్ట్రేలియా తుదికంటా పోరాడుతున్నాయి. మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేయడం ద్వారా బీజీటీ ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ టోర్నీ రేసులో నిలువాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. మరోవైపు గత రెండు పర్యాయాలు సిరీస్
కోల్పోయిన ఆసీస్ ఈసారి ఎలాగైనా కసితీర్చుకోవాలని చూస్తున్నది.
తద్వారా డబ్ల్యూటీసీకి బెర్తు దక్కించుకోవాలన్న ఆరాటంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్(33 బంతుల్లో 61, 6ఫోర్లు, 4సిక్స్‌లు) సుడిగాలి అర్ధసెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 141-6 స్కోరు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు రాహుల్(13), గిల్(13), కోహ్లీ(6) మరోమారు విఫలమైన వేళ తాను ఉన్నానంటూ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ క్రమంలో భారత్ తరఫున రెండో వేగవంతమైన(29 బంతుల్లో) అర్ధసెంచరీ రికార్డును పంత్ తన పేరిట లిఖించాడు. జడేజా(8), సుందర్(6) క్రీజులో ఉన్నారు. స్కాట్ బోలాండ్(4-42) టీమ్ఇండియా పతనాన్ని శాసించాడు. కమిన్స్, వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9-1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది. వెబ్‌స్టర్(105 బంతుల్లో 57, 5ఫోర్లు), స్మిత్(33) ఆకట్టుకున్నారు. పిచ్ పరిస్థితులకు అనుకూలంగా మలుచకుంటూ ప్రసిద్ధ్ కృష్ణ(3-42), సిరాజ్(3-51), నితీశ్(2-32), బుమ్రా(2-33) ఆసీస్ పతనంలో కీలకమయ్యారు. సీనియర్లు విఫలమైన చోట ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే వెబ్‌స్టర్ అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్(22) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. స్టార్క్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ బౌండరీలతో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. స్టార్క్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ జైస్వాల్ చూడచక్కని షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే మరో ఎండ్‌లో రాహుల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న రాహుల్..జైస్వాల్‌కు తోడ్పాటు అందించాడు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన బోలాండ్..రాహుల్‌ను సూపర్ స్వింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి మన పతనానికి నాంది పడింది. ఐదు పరుగుల తేడాతో రాహుల్‌ను అనుసరిస్తూ జైస్వాల్ కూడా బౌల్డ్ కావడంతో 47 పరుగులకే టీమ్ఇండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
రోహిత్‌శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్(13) తన వికెట్ విలువను గుర్తించలేకపోయాడు. క్రీజులో నిలదొక్కుకోవాల్సింది పోయి అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. వెబ్‌స్టర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన గిల్…కీపర్ క్యారీ క్యాచ్‌తో ఔటయ్యాడు. గిల్ కంటే ముందు బోలాండ్ మరోమారు భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతిని ఆడబోయిన కోహ్లీ..స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఈ సిరీస్‌లో ఏకంగా ఎనిమిదో సారి కోహ్లీ ఇదే శైలిలో వికెట్ ఇచ్చుకోవడం విశేషం. దీంతో 78 పరుగులకే టీమ్ఇండియా కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్..స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతినే కండ్లు చెదిరే రీతిలో సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. తన బ్యాటింగ్ శైలిపై వస్తున్న విమర్శలకు పంత్ అదే రీతిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో, తన ట్రేడ్‌మార్క్ షాట్లు ఆడుతూ ఆసీస్ బౌలర్లను కంగారెత్తించాడు.
పంత్ బ్యాటింగ్ ధాటకి ఒక దశలో కెప్టెన్ కమిన్స్ బౌండరీల వద్ద ఆరుగురు ఫీల్డర్లను మోహరించాల్సి వచ్చింది. ఏ మాత్రం ఒత్తిడికి గురికాని పంత్..భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వెబ్‌స్టర్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు కొట్టిన పంత్..29 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో కమిన్స్ బంతిని షాట్ ఆడబోయిన ఈ హార్డ్‌హిట్టర్ కీపర్ క్యాచ్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటి వరకు హోరెత్తిన స్టేడియం పంత్ ఔట్ కావడంతో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత వచ్చిన నితీశ్(4) మరోమారు ఘోరంగా విఫలమయ్యాడు.
టీమ్ఇండియా బౌలర్లు సమిష్టి ప్రదర్శన కనబరిచారు. పిచ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించారు. లబుషేన్(2)ను బుమ్రా ఔట్ చేయడం ద్వారా ఆసీస్ పతనానికి తెరలేచింది. దూకుడు మీద కనిపించిన కాన్స్టాస్(23)ను సిరాజ్ పెవిలియన్ సాగనంపాడు. లంచ్ విరామం తర్వాత బుమ్రా గాయంతో డగౌట్ చేరడంతో బౌలింగ్ భారాన్ని సిరాజ్, కృష్ణ మోయాల్సి వచ్చింది. వీరిద్దరికి కోహ్లీ అండగా నిలిచాడు. బ్యాటర్లకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తూ వికెట్ల వేట కొనసాగించాడు. సహచర బ్యాటర్లు విఫలమైనా అరంగేట్రం బ్యాటర్ వెబ్‌స్టర్ జట్టును ఆదుకున్నాడు. ఆఖరి వరస బ్యాటర్లతో కలిసి కీలక పరుగులు జోడించాడు. చివర్లో నితీశ్..కమిన్స్(10), స్టార్క్(1)ను ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు ముగింపు పడింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 185 ఆలౌట్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్,
భారత్ రెండో ఇన్నింగ్స్: 141-6(పంత్ 61, జైస్వాల్ 22, బోలాండ్ 4-42, వెబ్‌స్టర్ 1-24)