భారత యువ కిషోరాలు శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్..బంగ్లాదేశ్‌పై గర్జించారు. భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ఈ ఇద్దరు.. బంగ్లాపై సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. ఘోర రోడ్డు ప్రమాదంలో కొరి ప్రాణంతో బయటపడి మైదానంలో మళ్లీ అడుగుపెట్టిన పంత్ టెస్టుల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. చిదంబరం స్టేడియంలో బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేస్తూ శతకంతో విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతోఅభిమానులను అలరిస్తూ కెరీర్లో ఆరో సెంచరీ ఖాతాలో వేసుకుంటూ దిగ్గజ ధోనీతో సమంగా నిలిచాడు.
తానేం తక్కువ కాదన్నట్లు గిల్ కూడా
ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బంగ్లా బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వీరిద్దరి శతక విజృంభణతో బంగ్లా ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మరో రెండు రోజులు మిగిలున్న మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా 158 పరుగులతో కొనసాగుతున్నది. టీమ్ఇండియా బౌలర్లు జూలు విదిలిస్తే..బంగ్లాదేశ్ ఖేల్ ఖతమైనట్లే.
చెన్నై: సొంతగడ్డపై తమకు తిరుగులేదని భారత్ మరోమారు చేతల్లో చూపెడుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా తమ వ్యూహాల్లో తేడా ఉండదని సిరీస్‌కు ముందే హెచ్చరించిన కెప్టెన్ రోహిత్‌శర్మ..అందుకు తగ్గట్లు బంగ్లాదేశ్‌కు ఉచ్చు బిగిస్తున్నాడు. టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వేళ తొలి టెస్టుపై పూర్తి పట్టు సాధించింది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఓపెనర్లు జాకిర్ హసన్(33), షాద్మన్(35) మెరుగైన శుభారంభం అందించగా, కెప్టెన్ నజ్ముల్(51 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అశ్విన్(3/63) మూడు వికెట్లు తీసి జోరుమీదున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా..గిల్(176 బంతుల్లో 119 నాటౌట్, 10ఫోర్లు, 4సిక్స్‌లు), పంత్(128 బంతుల్లో 109, 13ఫోర్లు, 4సిక్స్‌లు) సెంచరీలతో విజృంభించారు. బంగ్లా బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ వీరిద్దరు రాణించడంతో 287 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మెహదీహసన్(2/103) రెండు వికెట్లు దక్కాయి.
గిల్, పంత్ మోత
యువ క్రికెటర్లు గిల్, పంత్..చెన్నై చిదంబరం స్టేడియంలో పరుగుల వరద పారించారు. బంగ్లా బౌలర్లను సులువుగా ఎదుర్కొంటూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్..తన విలువ చాటుకున్నాడు. ఎక్కడా చెత్త షాట్లకు పోకుండా ఇన్నింగ్స్ కొనసాగించాడు. స్పిన్నర్ మెహదీ హసన్ బౌలింగ్‌లో సిక్స్‌తో గిల్ 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్‌లో పంత్..గిల్‌కు చక్కని సహకారం అందించాడు. తొలి సెషన్లో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డ ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్‌కు రూపకల్పన చేశారు.
ఓవైపు మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. అయితే షకీబ్ అల్హసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన పంత్..72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ నజ్ముల్ క్యాచ్ విడిచిపెట్టడంతో లైఫ్ దక్కించుకున్నాడు. ఇక అక్కణ్నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. గిల్ ఒకింత నెమ్మదించగా, పంత్ టాప్‌గేర్‌లో దూసుకెళ్లాడు. బౌండరీలతో ఆకట్టుకున్నాడు. షకీబ్ బౌలింగ్‌లో 124 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో పంత్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. ఆకాశం వైపు తదేకంగా చూస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. మెహదీ వేసిన మరుసటి ఓవర్లోనే అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్ సెంచరీ మార్క్ అందుకోగా, రాహుల్(22) నాటౌట్‌గా నిలిచాడు
బంగ్లా 158/4:
భారీ లక్ష్యఛేదనలో బంగ్లాకు మెరుగైన శుభారంభమే దక్కింది. ఓపెనర్లు జకీర్, షాద్మన్ ఆకట్టుకున్నారు. మిడిలార్డర్లో కెప్టెన్ నజ్ముల్ అర్ధసెంచరీతో రాణించాడు. అశ్విన్(3/63) రాణించడంతో బంగ్లా నాలుగు వికెట్లు కోల్పోయింది. వెలుతురులేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను ముందుగానే నిలిపివేశారు.
పంత్ ప్రణామ్..!
రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి తిరిగి బంగ్లాదేశ్పైనే టెస్టుల్లో పునరాగమనం చేసిన పంత్ మూడో రోజు ఆటలో భావోద్వేగంతో కనిపించాడు. రెండో సెషన్లో మైదానంలోకి దిగే ముందుకు తన బ్యాట్, హెల్మెట్, గ్లౌసెస్కు మొక్కాడు. మరోవైపు తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లా కెప్టెన్ నజ్ముల్‌కు పంత్ సూచనలు ఇవ్వడం లైవ్‌లో రికార్డయ్యింది. ఇక్కడ ఒక ఫీల్డర్‌ను పెట్టమంటూ చెప్పడం నవ్వులు తెప్పించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 376 ఆలౌట్, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149 ఆలౌట్, భారత్ రెండోఇన్నింగ్స్: 287/4 డిక్లేర్డ్(గిల్ 119 నాటౌట్, పంత్ 109, మెహదీ 2/103), బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 158/4 (నజ్ముల్ 51 నాటౌట్, షాద్మన్ 35, అశ్విన్ 3/63)