RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో ఎట్టకేలకు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బోణీ కొట్టింది. ఐదు ఓటముల నుంచి తేరుకున్న కోల్‌కతా లోయర్ ఆర్డర్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తు చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయగా మరోసారి బాధగా మైదానం వీడాల్సి వస్తుందనుకున్న వేళ.. వైస్ కెప్టెన్ రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) జోడీ పట్టుదలకు రాజస్థాన్ దాసోహమైంది. ఏడో వికెట్‌కు అర్ధ శతకం భాగస్వామ్యంతో కోల్‌కతాకు తొలి విజాయన్ని కట్టబెట్టారిద్దరు. బ్రిజేష్ వేసిన చివరి ఓవర్లో రింకూ రెండు ఫోర్లు, సిక్సర్‌తో కేకేఆర్ యాజమాన్యం, అభిమానులను సంబురాల్లో ముంచెత్తాడు.
పంతొమ్మిదో సీజన్లో ఐదు మ్యాచుల్లో ఓడిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో మురిసింది. స్వల్ప ఛేదనలో ప్రధాన బ్యాటర్లు విఫలమైనా రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) సంచలన ఆటతో రాజస్థాన్ రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 70 పరుగులకే ఐదు వికెట్లు పడిన వేళ మరో ఓటమి దిశగా సాగుతున్న కోల్‌కతాను వీరిద్దరూ అద్భుతంగా విజయం వైపు నడిపారు. డెత్ ఓవర్లలో రాజస్థాన్ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న రింకూ, అనుకుల్ ఈ సీజన్లో కోల్‌కతాకు తొలి విజయాన్ని కట్టబెట్టారు.
తొలుత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3-14), కార్తిక్ త్యాగీ(3-22)ల ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను 155కే కట్టడి చేసిన కోల్‌కతా బ్యాటింగ్‌లో తడబాటును కొనసాగించింది. ఆర్చర్ సంధించిన మొదటి బంతికే సీఫర్ట్(0) బౌల్డయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో అజింక్యా రహానే(0)ను బర్గర్ వెనక్కి పంపాడు. ఓపెనర్లు డకౌటైన వేళ ఇంప్యాక్ట్ సబ్ రఘువంశీ(10 నాటౌట్) జతగా కామెరూన్ గ్రీన్(27) ధనాధన్ ఆడాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికిస్తున్న గ్రీన్‌ను బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు.
It took some time coming, but we finally have that 𝑾 🥹💜 pic.twitter.com/qxwyWpch38
— KolkataKnightRiders (@KKRiders) April 19, 2026
వైడ్ బాల్ ఆడబోయిన గ్రీన్‌ను.. జురెల్ రెప్పపాటులో స్టంపింగ్ చేశాడు. కుడివైపు డైవ్ చేస్తూ బంతిని అందుకున్న జురెల్ బంతిని గురి చూసి వికెట్ల మీదకు విసిరాడు. అంతే.. ఇదేంటి? ఇలా జరిగింది? అని గ్రీన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. యశ్ రాజ్ పూనియా ఓవర్లో పావెల్(23) 4, 6 బాదడంతో పవర్ ప్లేలో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 51 రన్స్ కొట్టింది. జోడీ అయినా నిలుస్తుందనుకుంటే జడ్డూ వరస ఓవర్లలో రఘువంశీ, పావెల్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది.
THAT’s SOME STUMPING! 🤯
🎥 Dhruv Jurel off balance & diving away from the stumps but hits the target 🎯
Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/lqjSajx2iO
— IndianPremierLeague (@IPL) April 19, 2026
టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యంతో 70కే ఐదు వికెట్లు పడిన వేళ వైస్ కెప్టెన్ రింకూ సింగ్(53 నాటౌట్)కు గెలుపు బాధ్యత తీసుకున్నాడు. పదిహేనో ఓవర్ తర్వాత రింకూ సింగ్ గేర్ మార్చాడు. పరాగ్ ఓవర్లో బౌండరీ.. ఆపై అర్చర్‌ను ఉతికేస్తూ రెండు ఫోర్లు బాదాడు.

అనుకుల్ రాయ్(29 నాటౌట్) ఓ సిక్సర్ కొట్టగా కోల్‌కతా రేసులోకి వచ్చింది. 18 బంతుల్లో 28 పరుగులు అవసరమవ్వగా.. బ్రిజేష్ ఏడు రన్స్ ఇచ్చాడంతే. కానీ, ఆర్చర్‌కు షాకిస్తూ అనుకుల్ రాయ్ సూపర్ సిక్సర్‌తో విజయాన్ని తేలిక చేశాడు. చివరి ఓవర్లో రింకూ 4, 4, 6తో అర్ధ శతకం పూర్తి చేసుకొని కోల్‌కతా నిరీక్షణకు తెరదించుతూ నాలుగు వికెట్ల విజయాన్ని అందించాడు.