హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్‌లో అతిపెద్ద మోటార్‌సైకిల్ రేసింగ్ కేటీఎమ్ ఆర్సీ కప్ టోర్నీకి హైదరాబాద్ వేదికైంది. చీకేన్ సర్య్యూట్ వేదికగా జరిగిన కేటీఎమ్ ఆర్సీ కప్ సెలెక్షన్స్‌లో యువ రేసర్లు దుమ్మురేపారు. ‘రెడీ టు రేస్’ పేరిట జరిగిన పోరులో దాదాపు 150మందికి పైగా రేసర్లు పోటీపడ్డారు. అయితే ఇందులో టాప్-10లో నిలిచిన విఘ్నేశ్గౌడ్, జయంత్, సిద్ధార్థ్‌రెడ్డి, జెన్నిఫర్, సాయికృష్ణ, యశోద కృష్ణ, ఉదాన్గౌడ్, కిరీటి, అభిషేక్, శేఖర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఎంపికయ్యారు.
బెంగళూరు, కొయంబత్తూరు, చెన్నై వేదికలుగా తదుపరి సెలెక్షన్స్ జరుగనున్నాయి. మొత్తంగా దేశంలోని ఎనిమిది నగరాల నుంచి రేసర్లు చెన్నైలో క్వాలిఫయర్స్‌లో తలపడుతారు. దేశవ్యాప్తంగా టాప్-3 రేసర్లకు ఆస్ట్రియాలో ఉన్న కేటీఎమ్ ప్రధాన కేంద్రం సందర్శనతో పాటు శిక్షణ అందిస్తారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ మాట్లాడుతూ రేసింగ్ అనేది కేటీఎమ్ డీఎన్ఏలోనే ఉందని పేర్కొన్నారు. ఎంతో మంది యువ రేసర్లకు కేటీఎమ్ అండగా నిలుస్తుందని తెలిపారు.