CM Cup 2024 | హైదరాబాద్, ఆట ప్రతినిధి: పల్లెల నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ వేదికగా సీఎం కప్ టోర్నీ ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా టోర్నీ లోగోతో పాటు మస్కట్(నీలమణి)ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ క్రీడాటోర్నీలకు వేదికగా మారుస్తాం. ఇటీవలి పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచినా.. 2028 ఒలింపిక్స్‌లో కచ్చితంగా తెలంగాణ నుంచి పతకాలు సాధించాలి. అందుకోసం ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచ విజేతగా నిలిచిన నిఖత్ జరీన్ మీకు ఆదర్శం. యువత వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మళ్లాలి. అన్ని మతాలకు ఏకైక వేదిక క్రీడా మైదానం’అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాసలహాదారు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.