Glenn Maxwell : ఐపీఎల్ 16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) చెలరేగుతున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. నిన్నరాత్రి చిన్నస్వామి స్టేడియంలో ఒత్తిడిలోనూ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై మ్యాక్స్‌వెల్ సునామీలా విరుచుకుపడ్డాడు. సిక్సర్ల మోత మోగించిన అతను అర్థ శతకంతో రాణించాడు. ఒత్తిడిలో అలా ఆడడం తనకేమీ కొత్త కాదని ఈ స్టార్ ప్లేయర్ తెలిపాడు.
‘ఆరంభంలోనే రెండు వికెట్లు పడడంతో నేను క్రీజులోకి వచ్చాను. కొత్త బంతి స్వింగ్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఆడడం నాకు చాలా ఇష్టం. గతంలోనూ చాలా సార్లు ఒత్తిడిలో రాణించాను. ఎందుకంటే.. ఒత్తిడిలో ఆడడం నాకు కొత్తేమీ కాదు’ అని మ్యాక్స్‌వెల్ వెల్లడించాడు.
చెన్నై బౌలర్లను ఉతికి ఆరేసిన మ్యాక్స్‌వెల్(76), డూప్లెసిస్(62)
మొదట ఆడిన చెన్నై 226 రన్స్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 15 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. విరాట్ కోహ్లీ(6), అభిషేక్ ఔటయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్‌వెల్ దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్‌లోకి పంపాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 రన్స్ చేశాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62)తో కలిసి 163 రన్స్ జోడించాడు. దాంతో, ఆర్సీబీ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ, వీళ్లిద్దరూ వెంట వెంటనే ఔట్ అయ్యారు. ధోనీ రెండు క్యాచ్‌లతో మ్యాక్స్‌వెల్, డూప్లెసిస్‌ను పెవిలియన్ పంపాడు. తర్వాత వచ్చిన దినేశ్ కార్తిక్(28), షహబాజ్ అహ్మద్(12) విఫలమయ్యారు. ఆఖర్లో సయాశ్ ప్రభుదేశాయ్ పోరాడినా సరిపోలేదు. 8 పరుగుల తేడాతో ధోనీ సేన విజయం సాధించింద. డూప్లెసిస్ సేన తదుపరి మ్యాచ్‌లో(ఏప్రిల్ 20న) పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.