ఐపీఎల్లో బలమైన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఓటమితో సీజన్ ప్రారంభించింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ జట్టు.. బౌలింగ్ విభాగం విఫలం అవడం వల్లే ఓటమి పాలైందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. డుప్లెసిస్, కోహ్లీ, దినేష్ కార్తీక్ మెరుపులతో 206 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించిన ఆర్సీబీ.. గెలిచేలా కనిపించింది.
కానీ మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ ఎవరూ బలమైన ప్రభావం చూపలేపోవడంతో ఓటమి చవి చూసింది. ఈ అంతర్జాతీయ బౌలర్లు ఎవరూ నిలకడగా లైన్ అండ్ లెంగ్త్ ఫాలో అవలేకపోయారని కైఫ్ అన్నాడు. ‘‘ఆర్సబీ చెత్తగా బౌలింగ్ చేసింది. దానిలో అనుమానం లేదు. గతేడాది పర్పుల్ క్యాప్ అందుకొని, భారత్‌కు ఆడే అవకాశం దక్కించుకున్న హర్షల్ పటేల్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ అతను మాత్రం చాలా వైడ్‌గా బౌలింగ్ చేశాడు’’ అని వివరించాడు.
అలాగే బౌలర్ల మానసిక పరిస్థితిని వివరిస్తూ.. ‘మంచి బంతులు వేసినప్పుడు కూడా బౌండరీలు వెళ్తే.. పర్లేదు. ఎందుకంటే పంజాబ్ దగ్గర చాలా మంది పవర్ హిట్టర్లు ఉన్నారు. అందుకని దూరంగా బంతులు వేసి, లైన్ అండ్ లెంగ్త్ మిస్ చేయడం కరెక్ట్ కాదు. ఆర్సీబీ బౌలర్లు ఇదే చేశారు. చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు’’ అని పేర్కొన్నాడు. సిరాజ్, హర్షల్, హసరంగా తమపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయారన్నాడు.
సిరాజ్ తొలి ఓవర్ చాలా ఛండాలంగా వేశాడని.. వైడ్లు, బౌన్సర్లతో ప్రారంభించాడని విమర్శించాడు. అలాగే ఫీల్డింగ్ విభాగం కూడా అంచనాలు అందుకోలేకపోయిందన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఒడియన్ స్మిత్ ఒక్క పరుగు చేసినప్పుడే అనూజ్ రావత్ అతని క్యాచ్ జారవిడిచాడు. ఆ తర్వాత జట్టు ఈ తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కేవలం 8 బంతుల్లోనే 25 పరుగులు చేసిన స్మిత్.. పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.