ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరింది. బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల మెరుపులు తోడవడంతో ఉత్కంఠ పోరులో పైచేయి సాధించిన ధోనీ సేన.. ఎనిమిదో విజయంతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ధాటిగా ఆడుతున్న కోల్‌కతా ఆటగాళ్ల ముందరి కాళ్లకు శార్దూల్ ఠాకూర్ బంధం వేస్తే.. తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్ రవింద్ర జడేజా మెరుపులు మెరిపించాడు.
అబుదాబి: బంతితో కట్టిపడేసిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాట్‌తోనూ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో చెన్నై ఎనిమిదో విజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (45), నితీశ్ రాణా (37 నాటౌట్) రాణించగా.. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, ఒక సిక్సర్) బ్యాట్ ఝళిపించాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, హజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నాలుగు ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా 21 పరుగులే ఇచ్చి రాహుల్ త్రిపాఠి వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (43; 7 ఫోర్లు) దంచికొట్టడంతో చెన్నైకి శుభారంభం దక్కింది. వీరితో పాటు మొయిన్ అలీ (32) కూడా రాణించడంతో ఒకదశలో చెన్నై గెలుపు లాంచనమే అనిపించినా.. కోలుకున్న కోల్‌కతా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠ భరితంగా మార్చారు.
అంబటి రాయుడు (10), సురేశ్ రైనా (11), మహేంద్రసింగ్ ధోనీ (1) వెంటవెంటనే ఔట్ కావడంతో సూపర్ కింగ్స్‌పై ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన దశలో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో రవీంద్ర జడేజా (8 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో మొత్తంగా 22 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో సామ్ కరన్ (4), జడేజా ఔటైనా.. చేయాల్సిన పరుగుల ఎక్కువ లేకపోవడంతో చెన్నై పని సులువైంది. బౌలింగ్‌లో పరుగులు నియంత్రించడంతో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
కోల్‌కతా: గిల్ (రనౌట్/రాయుడు) 9, వెంకటేశ్ (సి) ధోనీ (బి) శార్దూల్ 18, త్రిపాఠి (బి) జడేజా 45, మోర్గాన్ (సి) డుప్లెసిస్ (బి) హజిల్‌వుడ్ 8, రాణా (నాటౌట్) 37, రస్సెల్ (బి) శార్దూల్ 20, కార్తీక్ (సి) ధోనీ (బి) హజిల్‌వుడ్ 26, నరైన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 171/6. వికెట్ల పతనం: 1-10, 2-50, 3-70, 4-89, 5-125, 6-166, బౌలింగ్: దీపక్ 4-0-32-0, కరన్ 4-0-56-0, హజిల్‌వుడ్ 4-0-40-2, శార్దూల్ 4-1-20-2, జడేజా 4-0-21-1.
చెన్నై: గైక్వాడ్ (సి) మోర్గాన్ (బి) రస్సెల్ 40, డుప్లెసిస్ (సి) ఫెర్గూసన్ (బి) ప్రసిద్ధ్ 43, అలీ (సి) వెంకటేశ్ (బి) ఫెర్గూసన్ 32, రాయుడు (బి) నరైన్ 10, రైనా (రనౌట్) 11, ధోనీ (బి) వరుణ్ 1, జడేజా (ఎల్బీ) నరైన్ 22, కరన్ (సి) (సబ్) నాగర్కోటి (బి) నరైన్ 4, శార్దూల్ (నాటౌట్) 3, దీపక్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 172/8. వికెట్ల పతనం: 1-74, 2-102, 3-119, 4-138, 5-142, 6-142, 7-168, 8-171, బౌలింగ్: ప్రసిద్ధ్ 4-0-41-1, ఫెర్గూసన్ 4-0-33-1, వరుణ్ 4-0-22-1, నరైన్ 4-0-41-3, రస్సెల్ 3-0-28-1, వెంకటేశ్ 1-0-5-0.