చెన్నై: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత వెటరన్ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో ఆరంభమైన అశ్విన్ ఐపీఎల్ కెరీర్.. 17 ఏండ్ల తర్వాత అదే ఫ్రాంచైజీతో ముగిసింది. ఈ మేరకు అతడు గురువారం ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ప్రతి ముగింపునకూ ఒక కొత్త ఆరంభం ఉంటుంది. నా ఐపీఎల్ కెరీర్ నేటితో ముగిసింది. కానీ ఇతర లీగ్స్‌లో ఆటపై నా అన్వేషణ నేటి నుంచే మొదలైంది’ అని అతడు రాసుకొచ్చాడు.
సుదీర్ఘ కెరీర్లో ఈ తమిళ తంబీ.. 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీసి ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసినవారిలో ఐదో స్థానంలో ఉన్నాడు. 2010, 2011లో సీఎస్కే టైటిళ్లు గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ చెన్నై దిగ్గజం.. 2010 సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డునూ గెలుచుకున్నాడు. ఆరు సీజన్ల పాటు చెన్నైకి ఆడిన ఆష్ అన్న.. ఆ జట్టు తరఫున 90 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. విదేశీ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.