సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఒక చాప్టర్ ముగిసింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన మాయావి రవిచంద్రన్ అశ్విన్..అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు అనూహ్య వీడ్కోలు పలికాడు. తన 14 ఏండ్ల ప్రస్థానానికి ఫుల్స్టాప్ పెడుతూ అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా టెస్టు డ్రాగా ముగిసిందన్న సంతోషంలో ఉన్న సగటు అభిమానిని షాక్‌కు గురిచేసేలా చేశాడు. జట్టులో తనకు స్థానం లేనప్పుడు కొనసాగడం ఎందుకన్న ఆలోచనకు వచ్చిన అశ్విన్ ఆస్ట్రేలియా గడ్డపై తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సహచరులందరూ అప్యాయంగా అన్నా అని పిలుచుకునే అశ్విన్..పేరుపేరునా అందరినీ పలుకరిస్తూ వీడ్కోలు పలికాడు. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా వికెట్ల వేట కొనసాగించిన ఈ తమిళ తంబి టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. క్లబ్ క్రికెట్లో కొనసాగుతానన్న అశ్విన్..అవసరమైనప్పుడు వచ్చేందుకు ఒక కాల్ దూరంలో ఉంటానని ప్రకటించాడు.
బ్రిస్బేన్ : డిసెంబర్ 18, 2024 భారత క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి వరకు రసవత్తరంగా సాగిన గబ్బా టెస్టు డ్రాగా ముగియగా, అంతే నాటకీయ పరిణామాల మధ్య దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు. వర్షం అంతరాయం కారణంగా అర్ధాంతరంగా ముగిసిన మూడో టెస్టులో డ్రా ఎదుర్కొవడం ఓవైపు అయితే అశ్విన్ రిటైర్మెంట్ వార్త సంచలనంగా మారింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారిన వేళ అశ్విన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ అశ్విన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి మీడియా సమావేశానికి వచ్చిన అశ్విన్ మాట్లాడుతూ ‘భారత క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్లలో ఇదే నాకు చివరి రోజు. నాలో క్రికెట్ ఇంకా మిగిలే ఉన్నా..క్లబ్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నాను. ప్రతీ ఒక్కరికి సమయం వస్తుంది. అది ఈ రోజు నాకు వచ్చింది. ఈ సుదర్ఘీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, సహచర క్రికెటర్లు రోహిత్, విరాట్, అ జింకా, పుజారా అం దరికీ కృతజ్ఞతలు. వాళ్లు పట్టిన క్యాచ్‌ల వల్లే టెస్టుల్లో వందలాది వికెట్లు ఖాతా లో వేసుకోగలిగాను’ అని అన్నాడు.
ఘనమైన భారత క్రికెట్ చరిత్రలో ఒక విలువైన అధ్యాయం ముగిసింది. తన స్పిన్ నైపుణ్యంతో ప్రత్యర్థికి పిచ్‌తో సంబంధం లేకుండా చుక్కలు చూపెట్టిన మహాజ్ఞాని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సహచరులను ఆశ్చర్యంలో పడేస్తూ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. దిగ్గజ అనిల్‌కుంబ్లే(619) తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అశ్విన్(537) తన ప్రస్థానాన్ని ముగించాడు. తన 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన అశ్విన్ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. పిన్న వయసులో తొలుత మీడియం పేసర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అశ్విన్.. ఆ తర్వాత కోచ్ సలహాతో స్పిన్నర్‌గా మారి ప్రపంచ యవనికపై తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు. అండర్-16 జాతీయ టోర్నీలో మొదలైన అతని కెరీర్ అచిరకాలంలోనే జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. 2010లో టీమ్ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 38 ఏండ్ల అశ్విన్..ఏడాది తేడాతో టెస్టుల్లోకి వచ్చేశాడు. వైవిధ్యమైన స్పిన్‌తో బ్యాటర్లకు ఎప్పుడూ చిక్కు ప్రశ్నగా కనిపించే ఈ తమిళ తంబి..ఎన్నో వైవిధ్యమైన టెక్నిక్‌లతో ముప్పుతిప్పలు పెట్టేవాడు.
పెట్టని కోటలాంటి స్వదేశీ పిచ్‌లపై బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్ల వేట కొనసాగించాడు. సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజాతో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేయడంలో కీలకమయ్యాడు. దీంతో తక్కువ టెస్టుల్లోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు. బ్యాటర్ తగ్గట్లు వ్యూహాన్ని రచించే ఈ స్పిన్ మేధావి పిచ్‌తో సంబంధం లేకుండా వికెట్లు తీయడంలో నేర్పరి. టెస్టుల్లో ఎక్కువ కాలం రాణించాలన్న పట్టుదలతో నిత్య విద్యార్థిని తలపిస్తూ తన యాక్షన్‌ను మార్చుకున్న అశ్విన్ వికెట్ల వేటలో మరింత ఆరితేరాడు. సేనా దేశాల(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పిచ్‌లపై భారత్‌కు ఆయువుపట్టుగా నిలిచాడు. స్పిన్‌తో కాకుండా లోయార్డర్‌లో కీలకమైన భాగస్వామ్యాల్లో భాగమవుతూ టీమ్ఇండియా విజయాల్లో పాలుపంచుకున్నాడు. కుంబ్లే తర్వాత టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో భారత స్పిన్నర్‌గా అరుదైన రికార్డు అందుకున్నాడు. ఇలా ఒక టెస్టులకే పరిమితం కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలువడంలో అశ్విన్ పాత్ర కీలకం. దూస్రా, క్యారమ్ లాంటి వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ ఖ్యాతికెక్కాడు. ఇంజినీర్ గ్రాడ్యుయేట్ అయిన అశ్విన్..పరిస్థితులకు తగ్గట్లు ఆటను అంచనా వేయడంలో పేరుగాంచాడు.
374 టెస్టుల్లో అశ్విన్ తీసిన మొత్తం వికెట్ల(537)లో భారత్ గెలుపులో 374 వికెట్లు భాగమయ్యాయి.
టెస్టుల్లో ఎక్కువ సార్లు 5వికెట్ల ప్రదర్శన
మురళీధరన్ 67, అశ్విన్ 37, వార్న్ 37
61 స్వదేశంలో అశ్విన్ 106 టెస్టులాడితే అందులో 61 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. తుది జట్టులో అశ్విన్ ఉంటే భారత్ గెలుపు శాతం 57.55 కావడం విశేషం.