R Ashwin | ఆసియా కప్ 2025 కోసం భారత టీ20 జట్టును ప్రకటించిన తర్వాత, సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆశ్చర్యకరంగా ఉందని.. నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు. జైస్వాల్‌ను ఇలా పక్కన పెట్టడం అన్యాయంగా అభిప్రాయపడ్డాడు. అద్భుతంగా ప్రదర్శిస్తున్న ఆటగాడికి ఇలాంటి అన్యాయం జరిగితే ఆటతీరును దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన తెలిపాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా తీసుకుని జట్టులోకి తీసుకోగా.. జైస్వాల్‌ను జట్టు నుంచి తప్పించింది. ఈ నిర్ణయం పై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించారు. ‘జట్టు కోసం నిస్వార్థంగా ఆడే యువ ఆటగాడు జైస్వాల్. ఇలా తప్పించబడడం చాలా బాధాకరం.
అతను తన వ్యక్తిగత రికార్డులను కంటే జట్టును ముందుపెట్టే ఆటగాడు. ఇలాంటి నిర్ణయం వల్ల అతను జట్టుకు కాకుండా.. తన వ్యక్తిగత విజయాల కోసం ఆడే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జైస్వాల్ ప్రదర్శనను గురించి మాట్లాడే సమయంలో టెస్టు క్రికెట్లో అవకాశం ఇచ్చిన వెంటనే తన ప్రతిభను అందిపుచ్చుకున్నాడు. ఇటీవల భారత టెస్ట్ బ్యాటర్లలో అతను అత్యంత విజయవంతంగా నిలిచాడు. ఏ ఫార్మాట్లో అవకాశం ఇచ్చినా, అతను జట్టుకు అత్యుత్తమంగా రాణించాడు. ఇంత మంచి ఆటగాడికి జట్టులో చోటు ఇవ్వకపోవడం అర్థం కావడం లేదని అశ్విన్ పేర్కొన్నారు. టీ20 ఫార్మాట్లో జైస్వాల్ 165 స్ట్రయిక్ రేట్‌తో ఆడుతున్నాడని, ఎప్పటికప్పుడు జట్టుకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అశ్విన్ చెప్పాడు. జైస్వాల్ వంటి ఆటగాళ్లు దొరకడం చాలా కష్టమైన విషయం. బంతిని బాదాల్సినప్పుడే కాదు.. కష్టం వచ్చినప్పుడు కూడా శక్తితో ఆడేందుకు ప్రయత్నిస్తాడని.. అలాంటి ఆటగాళ్లను ప్రోత్సహించడం కంటే, ఇలా పక్కన పెట్టడం అసంబద్ధమని అశ్విన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల జైస్వాల్ మళ్లీ తన కెరీర్‌ను మొదటి నుంచి పునరుద్ధరించుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం ప్రస్తుత టోర్నీ కోసమే కాకుండా.. భవిష్యత్ కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయంగా అశ్విన్ చెప్పుకొచ్చాడు. సెలక్టర్లు శుభ్‌మాన్ గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా పరిగణించే అవకాశం ఉందని.. బహుశా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా కనిపించొచ్చని.. అయితే, ప్రతి ఫార్మాట్లో ఒకే ఒక కెప్టెన్ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని అశ్విన్ తెలిపాడు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన వెంటనే, సామ్సన్ స్థానానికి ముప్పు ఏర్పడిందని.. దీని అర్థం సంజు సామ్సన్ ఆడకపోవచ్చని.. శుభ్‌మాన్ గిల్ ఖచ్చితంగా ఆడుతాడని, ఓపెనర్‌గా వస్తాడని పేర్కొన్నారు. శామ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని.. గతేడాది టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు.