Ranji Trophy | ముంబై: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి సెమీస్‌లో విదర్భతో మధ్యప్రదేశ్ అమీతుమీ తేల్చుకోనుండగా.. ముంబై వేదికగా జరగనున్న రెండో సెమీస్‌లో తమిళనాడుతో ముంబై పోటీ పడుతున్నది. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే.. రంజీ ట్రోపీ ఆడటం తప్పనిసరి అని బీసీసీఐ హుకుం జారీ చేయగా.. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు.
మరోవైపు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా టీమ్ నుంచి రిలీవ్ అయి.. రంజీ సెమీస్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే 41 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ముంబై స్టార్లతో దిట్టంగా ఉండగా.. తమిళనాడు వరుస విజయాలతో జోరు మీద ఉంది. ముంబై జట్టుకు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే సారథ్యం వహిస్తుండగా.. సాయి కిషోర్ కెప్టెన్సీలో తమిళనాడు బరిలోకి దిగనుంది. శ్రేయస్ అందుబాటులోకి రావడంతో జట్టు బలం మరింత పెరిగిందని రహానే పేర్కొన్నాడు. ‘అతడు అనుభవజ్ఞుడు. ముంబైకి అతడి సేవలు అమూల్యం. అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం ఇతర ఆటగాళ్లకు కూడా ఉపయోగ పడనుంది’ అని రహానే చెప్పుకొచ్చాడు.