నాగ్‌పూర్: దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సీజన్ 2024-25 చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి ఈ సీజన్లో ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగబోయే 90వ ఎడిషన్ టైటిల్ పోరులో గత సీజన్ రన్నరప్ విదర్భ, తొలిసారి ఫైనల్ చేరిన కేరళతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్ ఆసాంతం ఆడిన 9 మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిదింటిలో గెలిచిన విదర్భ.. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని జోరు మీదుంది. క్వార్టర్స్‌లో తమిళనాడును.. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, గత సీజన్లో తమకు టైటిల్ దక్కకుండా చేసిన ముంబైని మట్టికరిపించిన ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది.
విదర్భ యువ బ్యాటర్ యశ్ రాథోడ్ ఈ సీజన్లో ఏకంగా 58.13 సగలతో 933 రన్స్‌తో జోరుమీదుండగా కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (674), సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (642), డానిష్ మలెవర్ (557), ధ్రువ్ షోరే (446) మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో 22 ఏండ్ల కుర్రాడు హరీష్ దూబే.. 9 మ్యాచ్‌లలో 66 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా ఏడు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉండటం విశేషం. ఇక రంజీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరిన కేరళ సైతం టోర్నీలో స్ఫూర్తిదాయక విజయాలతో తుది మెట్టు దాకా వచ్చింది. క్వార్టర్స్‌లో జమ్ము కశ్మీర్‌పై ఒక్క పరుగు, సెమీస్‌లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్ చేరిన సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ.. తమ సీజన్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది. సల్మాన్ నిజర్ (607 పరుగులు), మహ్మద్ అజారుద్దీన్ (601) కేరళ బ్యాటింగ్ ఆర్డర్‌కు కీలకం. బౌలర్లలో జలజ్ సక్సేనా (38 వికెట్లు), ఆదిత్య సర్వతె (30) ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.