Ranji Trophy 2024: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర. 80 ఏండ్ల రంజీ చరిత్రలో తొలిసారి ఒక జట్టు ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఉన్న సర్వీసెస్.. హర్యానాను ఒక్క పరుగు తేడాతో ఓడించి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సర్వీసెస్ నిర్దేశించిన 146 పరుగుల ఛేదనలో హర్యానా 144 పరుగుల వద్దే ఆలౌట్ అయింది.
మ్యాచ్ వివరాల్లోకెళ్తే.. హర్యానాలోని రోహ్తక్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సర్వీసెస్, తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో అర్జున్ శర్మ 41 పరుగులతో టాప్ స్కోరర్. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హర్యానా.. సర్వీసెస్ కంటే దారుణంగా ఆడింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 103 రన్స్‌కే ఆలౌట్ అయింది. రాహుల్ తెవాటియా (31) టాప్ స్కోరర్ కాగా ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన సర్వీసెస్ మరోసారి విఫలమైంది. ఈసారి ఆ జట్టు 140 పరుగులకు ఆలౌట్ అయింది. సర్వీసెస్ సారథి రజత్ పలివాల్ (86) దంచికొట్టాడు. 146 పరుగుల ఛేదనలో హర్యానా.. 144 పరుగుల వద్దే ఆగిపోయింది. సర్వీసెస్ బౌలర్లలో అర్జున్ శర్మ, పుల్కిత్ నారంగ్‌లు తలా ఐదు వికెట్లు తీసి హర్యానాను దెబ్బతీశారు.
రంజీ ట్రోఫీలో స్వల్ప తేడాతో విజయాలు..
1. ఒక్క పరుగు తేడాతో సర్వీసెస్ (హర్యానాపై) – 2024
2. రెండు పరుగుల తేడాతో జార్ఖండ్ (ఒడిషాపై) – 2018
3.నాలుగు పరుగుల తేడాతో బెంగాల్ (తమిళనాడుపై) – 2013
4. నాలుగు పరుగుల తేడాతో సౌరాష్ట్ర (ఢిల్లీపై)- 2016
5. ఐదు పరగుల తేడాతో విదర్భ (కర్నాటకపై) – 2017