జైపూర్: బికనీర్(రాజస్థాన్) వేదికగా జరుగుతున్న ఖేలోఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. గురువారం జరిగిన రెజ్లింగ్ పురుషుల 65కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో పిల్లనగొయిల నిఖిల్‌యాదవ్ పసిడి పతకంతో మెరిశాడు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) తరఫున బరిలోకి దిగిన నిఖిల్ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఆకట్టుకున్నాడు.
పురుషుల 79కిలోల విభాగంలో యువ వెయిట్‌లిఫ్టర్ గణేశ్ కాంస్య పతకంతో మెరిశాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన ఈ కుర్రాడు స్నాచ్‌లో 124కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 168కిలోలు ఎత్తి మొత్తంగా 292 కిలోలతో మూడో స్థానంలో నిలిచాడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహించిన గణేశ్ ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ కాంస్యం కైవసం చేసుకున్నాడు. మరోవైపు పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన తనీశ్క్ నాయుడు, నాగసాయి తరుణ్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు.