ఐపీఎల్లో రెండు జట్ల మధ్య పోరు అభిమానులను ఆకట్టుకుంది. వరుస విజయాలతో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై తమ సత్తాచాటుతూ సమిష్టి ప్రదర్శనతో మళ్లీ గెలుపు బాట పట్టింది. యశస్వి జైస్వాల్ ధనాధన్ బ్యాటింగ్‌కు తోడు ఆఖర్లో జురెల్, పడిక్కల్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు అందుకున్న రాజస్థాన్..చెన్నైని సమర్థంగా నిలువరించింది. జంపా, అశ్విన్ ధాటికి కింగ్స్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. తమ 200వ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించిన రాయల్స్ మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్టించింది.
జైపూర్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. తమ సొంత ఇలాఖాలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుత విజయంతో కదంతొక్కింది. గురువారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. దీంతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు ఖాతాలో వేసుకున్న రాయల్స్ 10 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. తొలుత యశస్వి జైస్వాల్(43 బంతుల్లో 77, 8ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో విజృంభించగా, ధృవ్ జురెల్(15 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 27 నాటౌట్, 5 ఫోర్లు) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 202/5 స్కోరు చేసింది. తుషార్దేశ్పాండే (2/42) రెండు వికెట్లు పడగొట్టగా, తీక్షణ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. నిర్దేశిత లక్ష్యఛేదనలో చెన్నై 170/6 స్కోరుకు పరిమితమైంది. శివమ్ దూబే(33 బంతుల్లో 52), గైక్వాడ్(47) రాణించారు. ఆడమ్ జంపా(3/22), అశ్విన్(2/35) చెన్నై పతనంలో కీలక పాత్ర పోషించారు. జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైపై రాజస్థాన్‌దే పైచేయి అయ్యింది.
జైస్వాల్ నాటుకొట్టుడు : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. యువ బ్యాటర్ జైస్వాల్ ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే తనదైన దూకుడు కనబరిచాడు. ఆకాశ్సింగ్ను లక్ష్యంగా చేసుకున్న జైస్వాల్ మూడు ఫోర్లతో జోరు చూపించాడు. మరో ఎండ్‌లో బట్లర్ కూడా బ్యాటు ఝులిపించడంతో చెన్నై బౌలర్లు చేష్టలుడిగిపోయారు. మరోమారు బౌలింగ్‌కు వచ్చిన ఆకాశ్‌ను యశస్వి మూడు ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో అరుసుకున్నాడు. ఇలా బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా ఈ ఇద్దరు చెలరేగడంతో రాయల్స్ పవర్‌ప్లే ముగిసే సరికి 64 పరుగులు చేసింది. ఈ క్రమంలో 26 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన బట్లర్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. యశస్వి జోరుకు బ్రేకులు వేసేందుకు కెప్టెన్ ధోనీ అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అయితే దేశ్‌పాండే ఓవర్లో జైస్వాల్‌తో పాటు శాంసన్(17) ఔట్ కావడంతో స్కోరు ఒకింత మందగించినా..ఆఖర్లో జురెల్, పడిక్కల్ చెలరేగడంతో రాయల్స్‌కు కలిసి వచ్చింది.
దూబే చెలరేగినా : నిర్దేశిత లక్ష్యఛేదనలో రుతురాజ్ గైక్వాడ్(47)ఆకట్టుకున్నా..ఫామ్‌మీదున్న కాన్వే(8) విఫలం కావడంతో చెన్నైకి శుభారంభం దక్కలేదు. రాయల్స్ స్పిన్నర్లు జంపా, అశ్విన్ వైవిధ్యమైన స్పిన్‌తో చెన్నై బ్యాటర్లను ఒత్తిడి పెంచడం కలిసొచ్చింది. రహానే(15), రాయుడు(0) విఫలం కావడం జట్టు కొంపముంచింది. దూబే, జడేజా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా..ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కావడంతో సాధ్యపడలేదు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది 200వ మ్యాచ్. చెన్నైతో జరిగిన ఈ పోరులో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో తన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో చెన్నైపై రాజస్థాన్‌కు ఇది రెండో విజయం.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 202/5(జైస్వాల్ 77, జురెల్ 34, తుషార్ 2/42, తీక్షణ 1/24),
చెన్నై: 20 ఓవర్లలో (దూబే, గైక్వాడ్ 47, జంపా 3/22, అశ్విన్ 2/35)