న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు మరోసారి చేతులు మారనున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఎన్.మిట్టల్ కుటుంబం రాయల్స్ జట్టును కొనుగోలు చేసింది. మరో ప్రముఖ వ్యాపారవేత్త అదర్ పూనావాలాతో కలిసి ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. మొత్తంగా రూ. 15,600 (1.65 బిలియన్ డాలర్లు) రికార్డు బిడ్‌తో ఈ ఒప్పందం ఖరారైంది. ఇది వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కోసం అమెరికాకు చెందిన కాల్ సోమాని, రాబ్ వాల్టన్‌తో కూడిన కన్సార్టియం వేసిన 1.63 బిలియన్ డాలర్ల బిడ్ సాంకేతిక, ఇతర కారణాల వల్ల విఫలమైంది. దాంతో మిట్టల్ కుటుంబం రేసులోకి వచ్చి ఆర్ఆర్ ఫ్రాంచైజీని దక్కించుకుంది.
ఈ లావాదేవీలో ఐపీఎల్లో రాజస్థాన్ పురుషుల జట్టుతోపాటు దక్షిణాఫ్రికాలోని పార్ల్ రాయల్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు బార్బడోస్ రాయల్స్ కూడా ఉన్నాయి. తాజా ఒప్పందం ప్రకారం మిట్టల్ కుటుంబం 75 శాతం.. అదర్ పూనావాలా 18 శాతం వాటాను సొంతం చేసుకోగా, మిగిలిన 7 శాతం మనోజ్ బడాలెతో పాటు ప్రస్తుత వాటాదారుల వద్ద ఉంటుంది.
కొత్తగా ఏర్పాటు చేసే రాజస్థాన్ రాయల్స్ బోర్డులో లక్ష్మి మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్యతో పాటు పూనావాలా, మనోజ్ బడాలె తదితరులు సభ్యులుగా కొనసాగుతారు. ఈ లావాదేవీలు పూర్తి చేసేందుకు బీసీసీఐ, సీసీఐ, ఐపీఎల్ పాలక మండలి అమోదం తప్పనిసరి. ఈ ఆర్థిక సంవత్సరం మూడోత్రైమాసికంలోగా జట్టు యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.