వడోదర: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్, హర్యానా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. గురువారం వడోదరలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్.. 19 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) శతకంతో కదం తొక్కగా కెప్టెన్ లోమ్రర్ (60) రాణించడంతో ఆ జట్టు 47.3 ఓవర్లలో 267 పరుగులు చేసింది. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/52) ఐదు వికెట్లతో మెరిశాడు.
కానీ ఛేదనలో తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకే చేతులెత్తేసింది. మరో మ్యాచ్‌లో హర్యానా.. 72 పరుగుల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా.. నిర్ణీత ఓవర్లలో 298/9 పరుగులు చేసింది. బెంగాల్ తరఫున ఆడుతున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (3/61) మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ బెంగాల్ 226 పరుగులకే కుప్పకూలింది. క్వార్టర్స్‌లో హర్యానా.. గుజరాత్‌తో తలపడనుండగా, రాజస్థాన్ విదర్భతో తలపడనుంది.