IPL | ముంబై ఇండియన్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఇది 1000వ మ్యాచ్. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు ఈ రోజే. ముంబై సారధిగా రోహిత్ శర్మ 150వ మ్యాచ్ ఆడుతున్నాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. సహచర ఓపెనర్ జోస్ బట్లర్, సారధి సంజూ శాంసన్, పడిక్కల్, హోల్డర్, సిమ్రాన్, ధ్రువ్ జురేల్ పెవిలియన్ దారి పట్టినా.. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. 18వ ఓవర్ లో మెరిడత్ వేసిన ఐదో బంతిని ఫోర్ గా మలచడంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు ఎనిమిదో ఓవర్ లో పీయూష్ చావ్లా వేసిన తొలి బంతిని బట్లర్ లాంగాన్ మీదుగా రమణ్ దీప్ సింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి బట్లర్ 18 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సారధి సంజూ శాంసన్ సిక్సర్ కొట్టాడు. కానీ పదో ఓవర్లో అర్షద్ ఖాన్ వేసిన ఐదో బంతిని తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ దారి పట్టాడు. వరుసగా బ్యాటర్లు ఔట్ అవుతున్నా.. చివరి ఓవర్ వరకు క్రీజులో నిలకడగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్ 124 పరుగుల వద్ద చివరి ఓవర్ లో అర్షద్ ఖాన్ బౌలింగ్ లో నాలుగో బంతికి ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 212 పరుగులు చేసింది.